వెల్గటూర్, మే 20: మూడు నెలల క్రితం ఎండిపోయిన వ్యవసాయ బావిలో మండు వేసవిలో నీరు ఉప్పొంగిన ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కిషన్రావుపేట శివారులో అన్నమనేని సాధరావుకు చెందిన వ్యవసాయ బావి మూడు నెలల క్రితం అడుగంటి పోయింది. ఆ భూమిని ఆనుకుని ఇంజపురి అంజి అనే హనుమాన్ భక్తుడికి కొంత భూమి ఉంది. అందులో సీతారాముల గుడి నిర్మించుకొని పూజలు చేస్తున్నాడు.
మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పూజ చేసుకుంటున్న సమయంలో బావి నుంచి పెద్ద శబ్దం వచ్చింది. అటుగా వెళ్లి చూడగా బావి అడుగు నుంచి 7 మీటర్ల పైకి ఎగచిమ్ముతూ నీరు ఉబికి రాగా, ఆంజనేయ స్వామి మహిమగా భావించి పూజలు చేశాడు. నీటి ఊట నాలుగు గంటలపాటు కొనసాగింది. విషయం తెలిసి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బావి వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై భూగర్భజల శాఖ అధికారులను వివరణ కోరగా, భూమిలోపల పగుళ్లు, సుదీర్ఘకాలంగా నిల్వ ఉన్న నీటి ఒత్తిడి వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని విశ్లేషించారు. ఇది అరుదుగా కనిపించే ప్రకృతి వైపరీత్యమని పేర్కొన్నారు.