హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -1 పోస్టుల పరీక్షల నిర్వహణలోనే కాదు, నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయా? అంటే అవుననే అనిపిస్తున్నది. మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డీఎస్పీగా ఉద్యోగ నియామక పత్రమిచ్చి, ఆ వెంటే రద్దుచేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళా అభ్యర్థి నియామకాన్ని రద్దుచేసి, ఆమె నుంచి నియామకపత్రాన్ని వెనక్కి తీసుకున్నారు. పైగా ఈ విషయం బయటి పొక్కకుండా అత్యంత జాగ్రత్తపడుతున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, చెప్తే భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడకుండా డిస్క్వాలిఫై చేస్తామని బెదిరించినట్టు తెలిసింది. గ్రూప్ -1 పోస్టులను ఇటీవలే ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించడంతో ఆగమేఘాల మీద సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను పూర్తిచేసి, 562 మంది అభ్యర్థులకు నియామకపత్రాలిచ్చారు. మెదక్ జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థి డీఎస్పీగా ఎంపికయ్యారు. తాజాగా ఆమె నుంచి నియామకపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గ్రూప్-1 పోస్టుల భర్తీలో భాగంగా ఒకే హాల్ టికెట్ నంబర్ గల ఇద్దరు అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్ జారీచేశారు. ఇద్దరికీ డీఎస్పీ పోస్టింగ్ ఇచ్చారు. తీరా ఇప్పుడు నియామకాన్ని రద్దుచేశారు. అభ్యర్థి కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు సదరు మహిళా అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్ జీఆర్‌ఎల్‌లో ఉంది. టీజీపీఎస్సీ నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రావాలంటూ ఫోన్లు కూడా చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించారు. మెడికల్ టెస్ట్ నిర్వహించారు. టీజీపీఎస్సీ ఆఫీస్ నుంచి అభ్యర్థికి ఫోన్లు కూడా వచ్చాయి. సెప్టెంబర్ 27న శిల్పకళావేదికలో నియామకపత్రాలు అందుకునేందుకు రావాలంటూ గ్రూప్-1 అభ్యర్థులకు సమాచారాన్ని కూడా అందించారు. అయితే ఆ రోజు సీఎం రేవంత్‌రెడ్డి 35 మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీచేశారు. మిగతా వారికి సంబంధితశాఖల కౌంటర్లల్లో తీసుకోవాలని సూచించారు. పోలీసుశాఖ కౌంటర్ వద్దకు అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం సదరు అభ్యర్థి వెళ్లగా అప్పటికే అదే హాల్‌టికెట్ నంబర్ గల మరో అభ్యర్థి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు. దీంతో ఖిన్నురాలైన మహిళా అభ్యర్థి పోలీసుశాఖ కౌంటర్లో అధికారులను ప్రశ్నించగా, ఇద్దరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. తాజాగా మెదక్‌కు చెందిన అభ్యర్థిని పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గ్రూప్-1పై సీబీఐ విచారణ జరపాలని నిరుద్యోగ జేఏసీ నేతలు ఇంద్రానాయక్, జనార్దన్ డిమాండ్ చేశారు.