గాంధీ, ఉస్మానియా సహా 20 చోట్ల ఎస్టీపీల ఏర్పాటు
రూ.134.46 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ దవాఖానల రూపురేఖలనే మార్చేస్తున్నది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. మరో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రాష్ట్రంలోని 20 ప్రధాన దవాఖానల్లో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీ) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. పర్యావరణ, ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా దవాఖానల నుంచి వెలువడే వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు రూ.134.46 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాటా రూ.52.59 కోట్లు. ఈ ప్లాంట్లను అత్యాధునిక హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హెచ్ఏఎం)లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను సైతం పదేండ్లపాటు నిర్మాణ సంస్థలే నిర్వహించనున్నాయి.
వ్యర్థాల శుద్ధితో లాభాలెన్నో
దవాఖానల నుంచి విడుదలయ్యే వ్యర్థజలాలు అత్యంత ప్రమాదకరం. వీటితో అనారోగ్యాలు కలగడంతోపాటు పర్యావరణ కాలుష్యం జరిగే ప్రమాదం ఉన్నది. ప్రస్తుతం సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇకపై దవాఖాన వ్యర్థాలు శుద్ధి కానున్నాయి. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్స్, పేషంట్ల బెడ్షీట్లు ఉతికేటప్పుడు, వార్డులను శుభ్రపరిచిన సమయంలో వచ్చే వ్యర్థ జలాలను ముందుగా డిసిన్ఫెక్ట్ చేసి ఎస్టీపీలకు పంపుతారు. అక్కడ శుద్ధి చేసి.. ఆ తర్వాత పునర్వినియోగించుకోవడం లేదా బయటకు పంపడం చేస్తారు. దీనివల్ల నీటి వనరులు కలుషితం కాకుండా కాపాడినట్టే.
ఎస్టీపీలు నిర్మించనున్న దవాఖానలు ఇవే..