హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గొర్రెల పంపిణీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి, పథకాన్ని ఆపించిన బీజేపీ నాయకులు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెలు పంపిణీ చేయాలంటూ బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి ధర్నా చేయడాన్ని ఖండించారు. ఈ పథకాన్ని బీజేపీ నిలిపివేయించినప్పుడు రాజగోపాల్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు.
సోమవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడులోని గొల్ల కురుమల నోటికాడి ముద్దను లాగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో నగదు బదిలీని ప్రయోగాత్మకంగా నిర్వహించామని, దానిని బీజేపీ అడ్డుకున్నదని వివరించారు. ఆ నగదు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే ఉన్నదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే రెండో విడత పంపిణీ కోసం విధి విధానాలు ఖరారు చేసి లబ్ధిదారులందరికీ గొర్రెలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.