హైదరాబాద్ : రాష్ట్రంలోని సాగునీటి ( Irrigation ) విషయాల్లో రాజకీయం మాని అసలు నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు -నిజాలు’ పై ( Waters – Truths ) శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి మేడిగడ్డ బ్యారేజీ ( Medigadda Barrage ) మేరు నగధీరుడిలా గోదావరి వరదను కూడా తట్టుకొని నిలబడిందని అన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీని కేసీఆర్, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తున్న విధంగానే కేసీఆర్ ప్రారంభించిన పనులను రేవంత్ రెడ్డి కొనసాగించాలని పేర్కొన్నారు. కేసీఆర్‌ను శత్రువుగా భావిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు శత్రువలని గమనించాలని సూచించారు.
కేసీఆర్ నాయకత్వంలో కోటి ఎకరాల మాగాణం
ఆంధ్ర కేడర్‌లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించి కృష్ణ ట్రైబ్యునల్‌లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలని కవిత కోరారు. కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పని చేస్తేనే రాష్ట్రం కోటి ఎకరాల మాగాణంగా మారిందని అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించాం. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని పేర్కొన్నారు.
నాడు కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పైరవీలు చేసుకున్నారు తప్పా,ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదని ఆరోపించారు. గట్టిగా జై తెలంగాణ అంటే వెంటనే ఫేక్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసేవారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ, బనకచర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణ జరిగే అన్యాయాన్ని గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నారు.
జలవనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారని, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్‌శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టి తమ చేతగాని తనాన్ని నిరూపించుకున్నారని పేర్కొన్నారు.