హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులు, ట్రోల్స్‌ను ఆపాలని తెలంగాణ మహిళా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. రాజకీయ వార్తాంశాలను కవర్ చేసే మహిళా జర్నలిస్టులపై పార్టీల కార్యకర్తలు టార్గెట్‌చేసి ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి పర్యటించి రుణమాఫీపై గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళ్లినప్పుడు కాంగ్రెస్ మద్దతుదారులు, సీఎం అభిమానులు బైకులతో రౌండప్‌చేసి, కెమెరా, ఫోన్లు లాక్కొని భయభ్రాంతులకు గురిచేశారని ఉదహరించారు. మహిళా జర్నలిస్టుల సమస్యలపై స్పందించే క్విక్ సపోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
మహిళా జర్నలిస్టులను రాజకీయ పార్టీలు, మద్దతుదారులు నడిపే పేజీల నుంచి, ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చే ట్రోల్స్‌కు ఆ రాజకీయ పార్టీలనే బాధ్యులను చేయాలని సూచించారు. ఈ మేరకు పోలీస్ శాఖ అన్ని రాజకీయ పార్టీలకు స్పష్టమైన హెచ్చరికలు జారీచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ర్టానికి చెందిన 48 మంది మహిళా జర్నలిస్టులు సంతకాలు చేసిన పత్రికా ప్రకటనను శనివారం విడుదల చేశారు.