అమరచింత, జనవరి 23 : అభివృద్ధి పనుల ప్రారంభంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి పేర్లు పెట్టక పోవడంతో గమనించిన అధికారులు శిలాఫలకం మాయం చేసిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో చోటుచేసుకున్నది. ఆత్మకూర్ పరమేశ్వరస్వామి చెరువు, అమరచింత పెద్దచెరువు ఆధునీకీకరణకు రూ.6 కోట్ల నిధులు మంజురయ్యాయి. మంత్రి శ్రీహరి భూమిపూజ చేసేందుకు ఆత్మకూర్ పరమేశ్వరస్వామి చెరువు సమీపంలో ప్రొటోకాల్ ఉన్న శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు లేకపోవడంతో భూమిపూజ సమయంలో గమనించిన అధికార పార్టీ నాయకులు.. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి పేరు లేకుండా ఏర్పాటు చేస్తారా? అంటూ కాలితో తన్నారని సమాచారం. అంతలోనే అప్రమత్తమైన అధికారులు శిలాఫలకాన్ని ఎవరికీ కనిపించకుండా మాయం చేశారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీంతో మంత్రి శ్రీహరి శిలాఫలకం లేకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా.. అమరచింతలో శిలాఫలకం లేకుండానే అభివృద్ధి పనులకు అధికారులతో కలిసి మంత్రి భూమిపూజ చేశారు.