హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఇచ్చే స్టైపెండ్ ను పెంచారు. పీజీ విద్యార్థులకు రూ.5 వేల నుంచి రూ.12వేలకు, పీహెచ్డీ స్కాలర్లకు రూ.7వేల నుంచి రూ.15వేలకు పెంచారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. పీజీ కోర్సులను 20 నెలల నుంచి 24 నెలలకు, పీహెచ్డీ కోర్సులను 25 నెలల నుంచి 36 నెలలకు పొడిగించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు.
విశ్వసనీయత కోల్పోతున్న ఎన్నికల సంఘం ; సీపీఐ నేతలు కూనంనేని, అజీజ్‌పాషా
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): బీహార్‌లో దాదాపు 65 లక్షల దళిత, మైనార్టీల ఓట్లను అక్రమంగా తొలగించడం ద్వారా ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను కోల్పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా విమర్శించారు. స్వయం ప్రతిపత్తిగల ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు ఓట్లను సృష్టించి ఎన్నికల్లో తన బలం చాటుతున్నదని మండిపడ్డారు. బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఇదే దుశ్చర్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు