Assembly Session | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం బీసీ రిజర్వేషన్ల పెంపుపై దృష్టి సారించిందని సమాచారం. ఇందులో భాగంగా కులగణన సర్వే నివేదికను ఫిబ్రవరి 2న క్యాబినెట్ సబ్‌కమిటీకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఫిబ్రవరి 5న క్యాబినెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించి, నివేదికను ఆమోదించనున్నట్టు తెలుస్తున్నది.
ఆ తర్వాత ఫిబ్రవరి 7న ఒక్క రోజు శాసనసభ సమావేశం నిర్వహించి, కులగణన సర్వే నివేదికను ఆమోదింపజేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతోనూ చర్చించి, సమావేశానికి అనుమతి తీసుకున్నట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఆమోదం తర్వాత తదుపరి కసరత్తు పూర్తి చేసి, మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రభుత్వవర్గాల సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి మొదటి వారం వరకు అమల్లో ఉంటుంది. దీన్నే కొనసాగిస్తూ మార్చి రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.