వికారాబాద్/కంది, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): గిరిజనులు భూములిచ్చే పరిస్థితిలేదని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ప్రభుత్వానికి సూచించి గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా లగచర్ల, రోటిబండతండాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతోపాటు సభ్యులు లీలాదేవి, రాంబాబునాయుడు, జిల్లా శంకర్ పర్యటించారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న లగచర్ల బాధితులనూ పరామర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులతో మాట్లాడి లగచర్ల ఘటనపై వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనులపై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి లగచర్ల ఘటనపై పరిస్థితులను తెలియజేస్తామని చెప్పారు.
2013 భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామంలో నోటీసులు ఇచ్చి, చాటింపు వేయించాలి.. గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పారు. దఫాదఫాలుగా ప్రజలతో చర్చించి సమస్య పరిష్కరించాలి కానీ.. ఒకేసారి గ్రామానికి వచ్చే వరకు ఏదో జరుగుతుందనే ఆందోళనతోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నామని, దాడి పేరిట అమాయక గిరిజనులను జైల్లో పెట్టడం సరైనదికాదని అన్నారు. దాడికి సంబంధంలేని వారిని తక్షణమే జైలు నుంచి విడుదల చేసి కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వానికి సూచించారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులకు స్టేషన్‌బెయిల్ ఇవ్వడం సరికాదని, ఇది ఎస్సీ, ఎస్టీ యాక్టుకు విరుద్ధమని తెలిపారు.
నేను వద్దన్నా సీఎం చేస్తుండు
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సోమవారం వికారాబాద్ జిల్లా మద్దూరు మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా బాధిత రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటూ ఎవరెవరిని కలిసి ఫార్మా వద్దని వినతి పత్రాలు ఇచ్చారని ప్రశ్నించింది. దానికి సమాధానంగా స్థానిక రైతులు సీఎం రేవంత్ రెడ్డిని కలుద్దామని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యామన్నారు. స్థానిక కాంగ్రెస్ నేత, రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్‌రెడ్డిని నాలుగైదు సార్లు కలిసి కాళ్లమీద పడ్డామని చెప్పారు. భూ సేకరణపై గుర్నాథ్ రెడ్డి ఏం అంటున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గిరిజనులను అడుగగా ‘నేను వద్దన్నా కానీ సీఎం చేస్తుండు, నా చేతకాదని, తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని సీఎం వద్దకు తీసుకుపోతా’ అని చెప్పారని గిరిజనులు వివరించారు.
సీఎం తమ సోదరుల మాట తప్ప ఎవ్వరి మాట వినడం లేదని దీనిని బట్టి అర్థమవుతున్నదని గిరిజనులు వాపోయారు. భూ సేకరణకు నోటీసులు ఇచ్చారా అని అడిగితే ‘మాకేం ఇవ్వలేరని, బ్యాంకుల అప్పు ఇవ్వకపోయే వరకు తెలిసిందని’ గిరిజనులు తెలిపారు. తదనంతరం సీఎంను కలిసేందుకు కొడంగల్‌కు వెళ్తుంటే మధ్యలోనే మమ్మల్ని అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారని… మా బాధను మేం ఎవరికి చెప్పుకోవాలి, ఎవరని అడగాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలైనా వదులుకుంటాంకానీ భూ ములు వదులుకోమని రైతులు అంటున్నారని, ప్రత్యామ్నాయ భూములను చూసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు భరోసానిచ్చారు.