STEM Courses | హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని అత్యధిక భారతీయ విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నవి సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్(స్టెమ్)కోర్సులే. 2.40లక్షల (22.7శాతం) మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, గణితం కోర్సుల్లో చేరగా, 2.02లక్షల (19.2శాతం) విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. అత్యధికులు స్టెమ్ కోర్సుల్లోనే చేరుతున్నట్టు వర్సిటీల ప్రతినిధులు వెల్లడించారు. కంప్యూటర్ సైన్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో భారతీయ విద్యార్థులు అధికంగా చేరుతున్నట్టు అరిజోనా స్టేట్ వర్సిటీ ప్రతినిధి తోట సాయికృష్ణ తెలిపారు. డాటా అనలెటిక్స్, డాటా సైన్స్, అకౌంటింగ్ కోర్సులు, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంకు డిమాండ్ ఉంటోందని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రతినిధి సల్మాన్ తెలిపారు. అమెరికా చదువులపై అవగాహన కల్పించేందుకు యూఎస్ఏ కాన్సులేట్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఫెయిర్ శుక్రవారం మాదాపూర్లో నిర్వహించగా యూఎస్ కాన్సులేట్ పబ్లిక్ ఆఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్లీన్ ప్రారంభించారు. 80 వర్సిటీల ప్రతినిధులు కోర్సులు, ఫీజులు, స్కాలర్షిప్ సమాచారాన్ని అందించారు.
లే ఆఫ్ల భయం.. ఆర్థిక మాంద్యం.. పైగా అనేక ఆంక్షలు. ఉద్యోగాల లేమి పీడిస్తున్నా మన విద్యార్థులు యూఎస్పైనే ఆశలు పెట్టుకుంటున్నారు. విదేశీ చదువుల కోసం అత్యధికులు అమెరికానే ఎంచుకుంటున్నారు. ఏటేటా అమెరికా వీసాలు పొందుతున్న ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒక్కరు భారతీయ విద్యార్థే ఉండటం విశేషం. 69శాతం విద్యార్థులు తమ అంతర్జాతీయ చదువులకు అమెరికానే గమ్యస్థానంగా భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులు 62 శాతముండగా, 16 మంది అండర్ గ్రాడ్యుయేట్, 1.3శాతం ఓపీటీ విద్యార్థులున్నారు. 2023లో 1.40లక్షల వీసాలను భారతీయ విద్యార్థులే పొందారు. మరే దేశ విద్యార్థులు ఈ స్థాయిలో వీసాలను పొందలేదు. అమెరికాలో ప్రస్తుతం 2.7లక్షల మంది భారతీయ విద్యార్థులున్నారు. వీరిలో 1.35లక్షల మంది తెలుగు రాష్ర్టాలకు చెందినవారే. న్యూయార్క్ వర్సిటీలో24వేల మంది చేరగా, ఆ తర్వాత నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో 20 వేలు, కొలంబియాలో 19వేలు, అరిజోనా వర్సిటీలో 17వేల మందితో టాప్ -4 స్థానాల్లో ఉన్నాయి. ఏటేటా అమెరికా వీసాలు పొందుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. 2017లో కేవలం 51వేల వీసాలను జారీచేయగా, 2023కు వచ్చేసరికి 1.4లక్షలకు చేరింది. అంటే ఈ ఏడు సంవత్సరాల్లో 90వేల వీసాలు అత్యధికంగా జారీ అయ్యాయి.