మెదక్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేసి, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని, విస్తరణకు అనుమతులు ఇవ్వరాదని, ఆదివారం రంగాయిపల్లిలో స్థానికులు దీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతు తెలిపిన సందర్భంగా వంటేరు మాట్లాడుతూ.. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీ వదులుతున్న కాలుష్యంతో రంగాయిపల్లి, చెట్లగౌరారం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తాగు, సాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నీటి, వాయు, శబ్ద కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఎంఎస్ అగర్వాల్ ఫ్యాక్టరీని పరిశీలించి, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగాయిపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలు మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజలు కావాలో.. ఫ్యాక్టరీ యాజమాన్యం కావాలో ప్రభుత్వం తేల్చుకోవాలని స్పష్టంచేశారు.