హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): వక్ఫ్‌బోర్డు సీఈఓ అసదుల్లాను తక్షణం తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖతోపాటు, సీఈఓగా అసదుల్లా, స య్యద్ అజ్మతుల్లా అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ ఈ తిరుమలాదేవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సీఈఓ నియమాకానికి చర్యలు చేపడతామని, సింగిల్‌జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరా రు. దీనికి ధర్మాసనం అనుమతిస్తూ వక్ఫ్‌బోర్డు సీఈఓను తక్షణం తొలగించాలన్న ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రతివాదులైన మహమ్మద్ అక్బర్, జహంగీర్‌ఖాన్‌కు నోటీసులు జారీచేస్తూ విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.
‘గొర్రెల కాపరుల’కు చెక్కుల పంపిణీ
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వివిధ ప్రమాదాలతో చనిపోయిన ముగ్గురు గొర్రెల కాపరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ సుబ్బారాయుడు శనివారం అందజేశారు. ప్రభుత్వం నుంచి అందిన సహకారాన్ని బాధిత కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, అధికారులు మనోజ్‌కుమార్, మధు, సిద్ధార్థ్, జాన్, వీరేంద్ర మోహన్, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.