హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): అల్లోపతి విద్యార్థులతో పాటు ఆయుష్ విద్యార్థులకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అల్లోపతి విద్యార్థులకు స్టైఫండ్ ఇచ్చి ఆయుష్ విద్యార్థులకు ఇవ్వకపోవటం చట్ట విరుద్ధమని, దీనికి సంబంధించిన జీవో 88ను సవాల్ చేస్తూ మహ్మద్ ఇబ్రహీం సహా 150 మంది ఆయుష్ ఇన్స్టిట్యూట్ పీజీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికీ 2016 నుంచి స్టైఫండ్ ఇవ్వాలని సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్ రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.