Janwada Farm house : జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చవద్దంటూ ఆ ఫామ్ హౌజ్ యజమాని ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫామ్‌హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని ఏఏజీని ధర్మాసనం కోరింది.
అంతేగాక కూల్చివేతలపై హైడ్రా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటివరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసింది..? ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటించారా.. లేదా..? అనే వివరాలు ఇవ్వాలని ఏఏజీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించారా..? అని ప్రశ్నించింది. హైదరాబాద్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోందని, ఆక్రమణలు ఎక్కువయ్యాయని ఏఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులను రక్షించడానికి హైడ్రా ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకొని హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నామని చెప్పారు. ఈ పిటిషన్‌కు విచారణర్హత లేదని, కొట్టివేయాలని కోరారు. కాగా 2014లో జన్వాడలో ఫామ్‌హౌస్ ఏర్పాటు చేశారని, 2019లో ప్రదీప్ రెడ్డి ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, పదేళ్ల తర్వాత ఇప్పుడు ఫామ్‌హౌస్ ఎందుకు కూల్చాలనుకుంటున్నారు..? ఇన్నేళ్లుగా అధికారులకు ఎఫ్టీఎల్ గుర్తుకు రాలేదా..? అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల ఎఫ్టీఎల్ను నోటిఫై చేస్తే ఆ వివరాలు ఇవ్వాలని కోర్టు కోరింది. దాంతో ప్రాథమికంగా నోటిఫై చేశామని, తుది నివేదిక రూపొందించే పనిలో ఉన్నామని ఏఏజీ తెలిపారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఎఫ్టీఎల్కు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.