హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థలం, విగ్రహానికి కలిపి రూ.3 కోట్లు విడుదల చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై పాపన్నగౌడ్ విగ్రహాన్ని నెలకొల్పడంలో తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. శనివారం కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీతో కలిసి ఆయన ట్యాంక్‌బండ్‌పై పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ నెల 18న పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలి.
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మూతబడ్డ వందలాది కల్లుగీత సొసైటీలను తెరిపించాలి. మరణించిన గౌడన్నల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలి. ఇప్పటికే పెండింగ్ ఉన్న రూ.13.5 కోట్లను తక్షణమే విడుదల చేయాలి. మ్యానిఫెస్టోలో పెట్టినట్టు 25 శాతం వైన్స్, బార్లను కల్లుగీత సొసైటీలకు కేటాయించాలి. జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ పేరును ప్రకటించాలి. కోకాపేటలోని గౌడ ఆత్మగౌరవ భవన్‌ను ప్రారంభించాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారికంగా పాపన్న జయంతి ఉత్సవాలను నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజుగౌడ్, రాష్ట్ర కన్వీనర్ వెంకన్నగౌడ్, వరింగ్ చైర్మన్ ఎలికట్టె విజయకుమార్‌గౌడ్, గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్ పాల్గొన్నారు.