రంగారెడ్డి : ముచ్చింతల్లో సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈ నెల 2న ప్రారంభమైన సహస్రాబ్ది వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఇవాళ ఉదయం ముచ్చింతల్ యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 12 రోజుల పాటు నిర్విఘ్నంగా లక్ష్మీనారాయణ మహాయాగం కొనసాగింది. చివరగా పారా గ్లైడర్లతో సమతామూర్తి విగ్రహంపై పుష్పాభిషేకం నిర్వహించారు.
హోమాలు చేసిన రుత్వికులను చినజీయర్ స్వామి సన్మానించారు. 12 రోజుల పాటు వివిధ హోమాల్లో 5 వేల మంది రుత్వికులు పాల్గొన్నారు. సోమవారం రాత్రికి జరగాల్సిన శాంతి కల్యాణం వాయిదా పడింది. వచ్చే శనివారం 108 ఆలయాల్లో శాంతి కల్యాణం నిర్వహించనున్నారు.