హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ ): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బుధవారం రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్‌ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు.
ఈ బంద్‌కు బీఆర్టీయూ, సీఐటీయూ, ఎఫ్‌యూటీయూ, ఐఎఫ్టీయూ తదితర సంఘాలన్నీ మద్దతు ఇచ్చినట్టు టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోడ్రైవర్‌కు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బీ వెంకటేశం, ఎస్ నర్సింహారెడ్డి, పీ శ్రీకాంత్, వీ కిరణ్, ఏ సత్తిరెడ్డి, సలీం, మీర్జారఫత్బేగ్, సతీశ్, ప్రేమ్‌చందర్‌రెడ్డి, తిరుమలేశ్గౌడ్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.