హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సెయిలింగ్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో శ్రీనివాస్‌గౌడ్‌ను తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు దాడి భోటే, సెయిలింగ్ కోచ్ సుహేమ్ షేక్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారు.
సెయిలింగ్‌ను హైదరాబాద్‌లోని హుసేన్ సాగర్‌కే పరిమితం చేయకుండా, రాష్ట్రం నలుమూలలకు విస్తరింపజేయాలి. మహబూబ్‌నగర్, సిద్దిపేటతోపాటు మిగిలిన అనువైన ప్రాంతాల్లోని జలాశయాలను పరిశీలించండి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సెయిలింగ్‌లో రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలి, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్లేయర్లు పతకాలు సాధించాలి’ అని అన్నారు. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనాలో జరగనున్న ఆసియా గేమ్స్‌కు ఎంపికైన యువ సెయిలర్ ప్రీతి కొంగరను మంత్రి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రీతికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో వికలాంగుల అభివృద్ధి చైర్మన్ వాసుదేవారెడ్డి ఉన్నారు.