హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఎవరెన్ని సర్కస్ ఫీట్లు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగుతున్నదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివా స సముదాయంలో బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తీగల సంతోష్‌తోపాటు ఆయ న అనుచరులు బీఆర్ఎస్లో చేరారు.
వారికి మంత్రి వేముల గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అండతో బాలొండ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. సాగునీరు, మౌలిక సదుపాయాలు, మెరుగైన వైద్య సేవలు, బీటీ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, సంక్షేమ పథకాలతో నియోజకవర్గం అలరారుతున్నదని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు సుభిక్షంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రపంచస్థాయి ప్రశంసలు దక్కుతున్నాయని వివరించారు.
దేశమంతా తెలంగాణ మాడల్ కోరుకుంటున్నదని అన్నారు. పచ్చబడుతున్న తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతున్నదని, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని ఆ పార్టీలపై మంత్రి మండిపడ్డారు. రాష్ర్టానికే కాదు యావత్తు దేశానికి బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల జడ్పీటీసీ బద్దం రవి, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా తదితరులు పాల్గొన్నారు.