హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీఎస్‌పీసీబీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యులతో ఏర్పాటుచేసిన ఈ బోర్డులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, బోర్డు కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఏ వాణీప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఐదుగురు ఎక్స్అఫీషియో సభ్యులు, ముగ్గురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆరుగురు ఇతర రంగాలకు చెందిన సభ్యులు ఉన్నారు. అటవీశాఖ, పురపాలకశాఖ, వైద్య ఆరోగ్యశాఖల ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమలశాఖ కమిషనర్, రవాణా శాఖ కమిషనర్లు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. మేడ్చల్ జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్ జెడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీసింగ్, నిజామాబాద్ కార్పొరేటర్ మహమ్మద్ హరూన్ఖాన్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కామర్స్-ఇండస్ట్రీస్ ట్రేడ్ అధ్యక్షుడు మీలా జయదేవ్, జేఎన్టీయూ ఎన్విరాన్మెంట్ సైన్స్ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ఇండియన్ ఫార్మర్స్ కన్సార్టియం రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి సభ్యులుగా, స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ, స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీలనూ ఎక్స్అఫీషియో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.