హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర పోలీస్, ఎక్సైజ్‌శాఖలు జట్టు కట్టాయి. రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో’ (టీఎస్‌న్యాబ్)తో కలిసి పనిచేసేందుకు ఎక్సైజ్‌శాఖ అంగీకరించింది. ఇటీవల ఎక్సైజ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీ.. టీఎస్‌న్యాబ్ అధికారులతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఏపీకి చెందిన కొందరు అక్రమార్కులు నానక్రామ్గూడను టార్గెట్ చేయడంతో టీఎస్‌న్యాబ్, ఎక్సైజ్ అధికారులు దానిని హాట్‌స్పాట్‌గా గుర్తించారు.
ఎల్బీనగర్ నుంచి నానన్రామ్గూడ వరకు ఇకపై ప్రత్యేక నిఘా పెట్టారు. వీకెండ్స్‌లో పార్టీలు, పబ్‌లకు వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగులపై కూడా దృష్టిపెడతామని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల నుంచి రాష్ట్రంలోకి గంజాయి, ఇతర సింథటిక్ డ్రగ్స్ రాకుండా ప్రత్యేకంగా 38 పోలీస్ చెక్‌పోస్టులు, 17 ఎక్సైజ్ చెక్‌పోస్టులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఎల్బీనగర్, ధూల్‌పేట, నానక్రామ్గూడపై ప్రత్యేక నిఘా పెట్టిన ఎక్సైజ్, పోలీసు అధికారులు దాడులకు రెడీ అవుతున్నారు.