హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. సింగపూర్‌లో నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ (ఎన్టీయూ)ని శుక్రవారం ఆయన సందర్శించారు. యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టిమ్వైట్ బృందంతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలోని యూనివర్సిటీలు, ఎన్టీయూ పరస్పర సహకారంతో పనిచేయడంపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రగామిగా కొనసాగుతున్నదని ఈ సందర్భంగా టిమ్వైట్ ప్రశంసించారు. అనంతరం తెలంగాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ విధానాలు, విద్యారంగం కోసం ప్రభుత్వం చర్యల గురించి వినోద్‌కుమార్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కోసం గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు హైదరాబాద్‌లో పర్యటించాల్సిందిగా టిమ్వైట్ బృందాన్ని వినోద్‌కుమార్ స్వాగతించారు. ఆ తర్వాత లీకాంగ్ చియాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ను వినోద్ సందర్శించారు.