Telangana Police Sports Meet | కరీంనగర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్రస్థాయి తృతీయ పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్‌మీట్-2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇంటలిజెన్స్ డీజీపీ శివధర్‌రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటోతేదీ వరకు జరిగే క్రీడాపోటీల్లో 29 క్రీడాంశాలకు 20 పోలీస్ జోన్ల నుంచి సుమారు 2400 క్రీడాకారులు పోటీ పడుతున్నారు. కరీంనగర్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోని 12 వేదికల ద్వారా ఈ క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిధిగా హాజరైన ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పౌరుషాల కరీంనగర్ గడ్డపై పోలీసుల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అనివార్య కారణాలతో 2017 తరువాత పోలీసుల క్రీడాపోటీలను నిర్వహించలేకున్నా, రాష్ట్ర పోలీసు క్రీడాకారులు ఇటీవల జరిగిన జాతీయస్థాయి క్రీడాపోటీల్లో 26 బంగారు పతకాలు, 79 రజత, 102 కాంస్య పతకాలు సాధించి సత్తాచాటారన్నారు.
క్రీడాపోటీల్లో రాణించే పోలీసులను ప్రొత్సహించేందుకు పతకాలు సాధించిన వారికి ఇంక్రిమెంట్లు అందిస్తున్నామని శివధర్ రెడ్డి చెప్పాన్నారు. పోలీసు ఉద్యోగమనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ఓత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం చేస్తాయన్నారు. మహిళా ఉద్యోగులు సైతం రాష్ట్ర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, వారి నుంచి పెద్ద సంఖ్యలో పతకాలు ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు పలు జోన్ల నుంచి వచ్చిన పోలీసు క్రీడాకారులు మార్చ్ఫాస్ట్లో పాల్గొన్నారు. వారి నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ స్పోర్ట్స్ తెలంగాణ ఎం రమేష్‌రెడ్డి, మల్టిజోన్ ఐజీపీ-1 ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి తదితరులు పాల్గొన్నారు.