Minister KTR | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలు హైదరాబాద్‌కే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని పల్లెల్లోనూ పరిశ్రమలు స్థాపించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆంత్రప్రెన్యూర్లు రూరల్ తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పార్క్‌హయత్ హోటల్లో మహిళా పారిశ్రామికవేత్తల ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ సెంటర్ (డబ్ల్యూఈఐటీటీసీ)ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. భారత్‌లో సుమారు 50 శాతం మంది 27 ఏండ్లలోపు యువతే ఉన్నారని, 60 శాతానికి పైగా 35 ఏండ్లలోపు వయసు కలిగిన వారేనని.. ఇది దేశానికి ఒక వరమని తెలిపారు. ప్రపంచంలోని మరే దేశానికి ఇంతటి గొప్ప మానవ వనరు లేదని పేర్కొన్నారు. దేశంలో అన్ని వనరులు ఉన్నా నేటికీ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమేనని ఆందోళన వ్యక్తంచేశారు. యువతకు ఉపాధి కల్పనలో కేంద్రం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. జపాన్‌లో 15 శాతం భూమి మాత్రమే ఉపయోగకరమని, కానీ.. ప్రపంచంలో జపాన్ స్థానమేంటో అందరికీ తెలుసని పేర్కొన్నారు. అణుబాంబు దాడితో చెల్లాచెదురైన దేశం కోలుకొని, ప్రపంచంలో తన సత్తా ఏమిటో చూపిస్తున్నదని, కానీ భారత్ మాత్రం నేటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రపంచంలో జనాభాపరంగా భారత్ అతిపెద్ద దేశం అని, కానీ ప్రపంచానికి భారత్ ఇచ్చింది మాత్రం శూన్యమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో యువతను సరైన మార్గంలో నడిపించే నాయకుడే లేడని తెలిపారు. ఒకప్పుడు చైనా ఆర్థికంగా మనకంటే వెనుకబడిన దేశమని, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగిందని గుర్తుచేశారు. మన కంటే ఏవిధంగానూ గొప్ప వనరులు లేని కొరియన్ దేశాలు ప్రపంచ టెక్నాలజీలో కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్వంటి ఎంతోమంది భారత్ నుంచి వెళ్లి ప్రపంచం గర్వించేస్థాయికి ఎదిగారని, దేశంలో వనరులు, వసతులు అన్నీ ఉంటే వాళ్లు వేరే దేశానికి ఎందుకు వెళ్లేవారని ప్రశ్నించారు. ప్రస్తుతం.. దేశ పరిస్థితిని చూస్తే బాధేస్తున్నదని అన్నారు. దేశాన్ని నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో నేటికీ భారత్ జాతీయ జెండా నుంచి మొదలు పెడితే బట్టలుకుట్టే దారం వరకూ ప్రతిదాని కోసం వేరే దేశాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఎదుగుతున్న పారిశ్రామికవేత్తలు ఇవన్నీ ఆలోచించాలని సూచించారు. ప్రపంచం మనకేం ఇచ్చిందని ఆలోచించకుండా, ప్రపంచానికే మనం ఇచ్చేస్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ వయస్సులో అతిచిన్న రాష్ట్రమైనప్పటికీ దేశానికే రోల్‌మాడల్‌గా మారిందని మం త్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పారు. ఒకప్పుడు ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే చెప్పులు అరిగిపోయేవని, కానీ.. ఇప్పుడు ఒక్క దరఖాస్తుతో అనుమతులన్నీ చకచకా ఇచ్చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో ఐదు రకాల విప్లవాలు తీసుకొచ్చామని తెలిపారు. గ్రీన్ రెవల్యూషన్‌తో వ్యవసాయాన్ని పండుగ చేశామని, బ్లూ రెవల్యూషన్ పేరుతో ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించామని, పింక్ రెవల్యూషన్‌తో మాంసం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచామని చెప్పారు. వైట్ రెవల్యూషన్‌తో పాలు, పాల ఉత్పత్తుల్లో ఆదర్శంగా నిలిచామని, ఎల్లో రెవల్యూషన్‌తో ఆయిల్‌పామ్ సాగును గణనీయంగా పెంచాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకొన్నామని, దేశానికి నూనెను అందించేస్థాయికి తెలంగాణ ఎదగబోతున్నదని తెలిపారు. ఈ ఐదు రకాల విప్లవాలతో తెలంగాణలో ఉపాధి గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని అనుకునేవాళ్లు జిల్లాలపై ఆసక్తి చూపాలని సూచించారు. మహిళా ఆంత్రప్రెన్యూర్ అంటే.. పికిల్స్, పాపడ్స్, పెట్టికోట్లు మాత్రమే అనే భ్రమ నేటికీ అనేకమందిలో ఉన్నదని, కానీ మహిళలు భూమి, ఆకాశం, నీరు అన్నింటా వ్యాపారాలు చేసే స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంత్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఏఎల్ఈఏపీ) ప్రెసిడెంట్ కన్నెగంటి రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నరసింహారెడ్డి, ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ డీ చంద్రశేఖర్, అలీప్ చీఫ్ ఇంక్యుబేషన్ ఆఫీసర్ వీణ, ఐటీటీసీ వైస్ చైర్మన్ జ్యోతి పిడికితి, ఆటోక్రసి మిషినరీ సీఈవో సంతోషి సుష్మా బుద్ధిరాజా తదితరులు పాల్గొన్నారు.
నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. చేనేత అభ్యున్నతికి మరిన్ని కార్యక్రమాలను రూపొందించనున్నామని వెల్లడించారు. టెక్స్టైల్స్ శాఖ నేతన్నలకు అందిస్తున్న ‘చేనేత మిత్ర’ తదితర కార్యక్రమాల అమలు తీరుపై సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో సమీక్షించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగ అభివృద్ధిని ప్రభుత్వం ఒక ప్రాధాన్యతరంగంగా గుర్తించిందని, ఈ రంగం అభివృద్ధి కోసం మౌలిక వసతుల కల్పన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. రాష్ట్రంలో మినీ టెక్స్టైల్స్, అప్పారెల్ పారుల అభివృద్ధిని చేపట్టామని గుర్తుచేశారు. ఆయా పారుల్లో ఇంకా మిగిలిపోయిన పనులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని పూర్తి చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గుండ్ల పోచంపల్లి అప్పారెల్ పార్, గద్వాల్ హ్యాండ్లూమ్ పార్కులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపునిచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. సమీక్షలో చేనేత, పవర్‌లూం కార్పొరేషన్ల చైర్మన్లు ఎల్ రమణ, గూడూరి ప్రవీణ్, టెక్స్టైల్స్ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.