హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజన యోధుడు రాంజీగోండు మ్యూజియాన్ని హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. మ్యూజియం నిర్మాణానికి ప్రభుత్వం అబిడ్స్‌లో 30 గుంటల స్థలంతోపాటు రూ.25 కోట్లు మంజూరు చేసింది. జీ ప్లస్ 4 లేదా జీ ప్లస్ త్రీ విధానంలో మ్యూజియాన్ని నిర్మించాలని గిరిజన సంక్షేమశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తున్నది. సెల్లార్లో పార్కింగ్, గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్రంథాలయం, మొదటి, రెండో అంతస్థుల్లో మ్యూజియం, రాంజీగోండు జీవిత విశేషాలను తెలిపే ఛాయాచిత్రాలతోపాటు మరో గోండు యోధుడు కుమ్రంభీం జీవిత విశేషాలను తెలిపే ఛాయాచిత్రాలు, ఆదివాసీ గిరిజన జీవన చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో సమ్మక్క-సారలమ్మ మ్యూజియాన్ని, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో కుమ్రంభీం స్మారక మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ మాసాబ్‌ట్యాంకులోని సంక్షేమభవన్ ప్రాంగణంలో గిరిజన సంక్షేమశాఖ రూ.5 కోట్లతో నిర్మిస్తున్న టీఆర్ఐ (ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) భవనం ప్రారంభానికి సిద్ధం అవుతున్నది. జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మించిన ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో గ్రంథాలయం, మొదటి అంతస్థులో టీఆర్ఐ కార్యాలయం, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో శిక్షణ, డైనింగ్ సౌకర్యాలు కల్పించారు.