హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి రుణం పొందాలన్నా, ప్రైవేటు వ్యక్తుల నుంచి పెట్టుబడి సమకూర్చుకోవాలన్నా వారికి తిరిగి చెల్లించగలమనే భరోసా కల్పించాలి. అప్పుడే అప్పైనా, పెట్టుబడైనా సమకూరుతుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేకుండానే ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రోడ్ల అభివృద్ధి కోసం నిధులు సమకూర్చుకునేందుకు మంగళవారం హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) వేదికగా రోడ్‌షో నిర్వహించబోతున్నది. అట్టహాసంగా చేపడుతున్న హ్యామ్ విధానం (హైబ్రిడ్ యాన్యుటీ మాడల్)పై ప్రైవేటు వ్యక్తులకు, బ్యాంకర్లకు అవగాహన కల్పించడం ద్వారా వారు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించాలన్నది ఈ రోడ్‌షో ప్రధాన ఉద్దేశం.
తెలంగాణలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ), పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం (పీఆర్ఈడీ) ఆధీనంలోని 29,900 కి.మీ. రోడ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో హ్యామ్ విధానంలో దశలవారీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇందులో తొలి విడతగా ఆర్అండ్బీ పరిధిలో 5,190 కి.మీ. పొడవైన 373 రోడ్లు, పీఆర్ఈడీ పరిధిలోని 7,947 కి.మీ. పొడవైన 2,254 రోడ్ల అభివృద్ధి, ఉన్నతీకరణ, నిర్వహణ తదితర పనులు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం కన్సల్టెంట్లు, పెట్టుబడిదారులు, బ్యాంకర్లను ఆహ్వానించింది. ఈ మేరకు తాజాగా పలు సంస్థలకు లేఖలు రాశారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ నెట్‌వర్క్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సహకారాలు అందించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లపై పెట్టుబడికి ఉన్న అవకాశాలు, తద్వారా కలిగే ప్రయోజనాలు, బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హతలు తదితర అంశాలపై రోడ్‌షోలో అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు.
ఏకంగా రూ.33,194 కోట్లు కావాలట
హ్యామ్ విధానంలో తొలి విడతగా రూ.33,194 కోట్లతో 13,137 కి.మీ. రోడ్ల అభివృద్ధికి ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో రూ.16,414 కోట్లతో 5,190 కి.మీ. ఆర్అండ్బీ రోడ్లతోపాటు రూ.16,780 కోట్లతో 7,947 కి.మీ. పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ విధానంలో 40% పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 60% పెట్టుబడులను కాంట్రాక్టర్లు సమకూర్చుకోవాల్సి ఉన్నది. కాంట్రాక్టర్లు తమ పెట్టుబడిని టోల్ వసూళ్ల ద్వారా రాబట్టుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ 60% కూడా తామే చెల్లిస్తామని చెప్తున్నది. అంటే.. ప్రభుత్వం వెచ్చించాల్సిన 40%, కాంట్రాక్టర్లు వెచ్చించాల్సిన 60% కలిపి మొత్తం 100% నిధులను బ్యాంకులు లేదా ప్రైవేటు సంస్థల నుంచే సమకూర్చుకోవాలని నిశ్చయించారు. కానీ, ఆ రుణాలను తిరిగి ఎలా చెల్లిస్తారనే దానిపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఓ వైపు ప్రభుత్వం దివాలా తీసిందని, అప్పు పుట్టడంలేదని, తమను ఎవరూ నమ్మడంలేదని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే చెప్తున్నందున పెట్టుబడిదారులు ఎలా ముందుకొస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
చిన్న కాంట్రాక్టర్ల బిల్లులకే దిక్కులేని వైనం
రాష్ట్రంలో గత వానకాలంలో పాడైన రోడ్లకు నిధుల కొరత వల్ల ఇంతవరకు మరమ్మతులు చేపట్టలేదు. ఆ మరమ్మతుల కోసం రూ.300 కోట్లతో టెండర్లు పిలిస్తే బిల్లులు వస్తాయనే నమ్మకం లేక పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇవికాకుండా ఆర్అండ్బీ పరిధిలో దాదాపు రూ.1,000 కోట్ల బిల్లులు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.5-10 లక్షల బిల్లులే రూ.165 కోట్ల మేరకు ఉన్నాయి. ఆర్అండ్బీ సహా పంచాయతీరాజ్, మున్సిపల్, ఇరిగేషన్, వాటర్ బోర్డు, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల్లో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు రూ.505 కోట్లు వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వకుండానే ఏకంగా రూ.33 వేల కోట్లకుపైగా నిధులను సమీకరించుకునేందుకు రోడ్‌షో ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, హ్యామ్ విధానాన్ని ఆది నుంచే వ్యతిరేకిస్తున్న బిల్డర్స్ అసోసియేషన్.. పాత విధానాన్నే కొనసాగించాలని ఇప్పటికే సీఎంకు బహిరంగ లేఖ రాసింది. దీంతో హ్యామ్ విధానం ఏ మేరకు ముందుకు సాగుతుందో కాలమే నిర్ణయించాలి.
హ్యామ్ రోడ్ల వివరాలు