హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ రాసినట్టు తెలిసింది. రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గతంలో ఎకరాకు రూ.30 లక్షల చొప్పున చెల్లించిందని ఆ లేఖలో గుర్తుచేసినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా ట్రిపుల్ఆర్ నిర్వాసితులకు కూడా చెల్లించాలని పేర్కొన్నట్టు సమాచారం. ట్రిపుల్ఆర్కు భూములు ఇచ్చేందుకు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరగకూడదనే ఉద్దేశంతో నిర్వాసితులకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలోనే ట్రిపుల్ఆర్ భూసేకరణ పురోగతిపై ఇటీవల ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గతంలో ఎన్టీపీసీ ఎకరాకు గరిష్ఠంగా రూ.30 లక్షల చొప్పున చెల్లించిన విషయాన్ని ప్రభుత్వానికి అధికారులు తెలిపారు. ఎన్టీపీసీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే కావడంతో అదే తరహాలో ట్రిపుల్ఆర్కూ నష్టపరిహారం చెల్లించాలని ఎన్హెచ్ఏఐని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు తెలిసింది.
ట్రిపుల్ఆర్ భూసేకరణ సమస్యల పరిష్కారానికి గాను కలెక్టర్ల నేతృత్వంలో ఆర్బిట్రేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్థానికంగా భూముల ధరలు ఎంత? సంవత్సరానికి ఎన్ని పంటలు పండుతాయి? ఆ భూములు పట్టణానికి దగ్గరగా ఉన్నాయా? భవిష్యత్తులో వాటి విలువ ఏ మేరకు పెరిగే వీలుంది?.. తదితర అంశాల ఆధారంగా భూముల ధరలను ఆర్బిట్రేషన్ నిర్ధారిస్తుంది. ఆ ధరలను ఎన్హెచ్ఏఐ చెల్లించాల్సి ఉంటుంది. భూసేకరణ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ ధరకు కనీసం రెండు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో నాలు గు రెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఎక రా సుమారు రూ.2 లక్షలు ఉండగా, రూ.6 లక్షల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.50 లక్షలకు పైనే పలుకుతుండటంతో మార్కెట్ ధర చెల్లిస్తే భూసేకరణ సాధ్యంకాదని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అందుకే వీలైనంత ఎక్కు వ నష్టపరిహారం చెల్లించాలని భావిస్తున్నది.
నష్టపరిహారం చెల్లింపులో మానవీయ కోణంలో ఆలోచించాలని ఎన్హెచ్ఏఐ అధికారులను సీఎం కోరారు. ఈ క్రమంలోనే ఎన్టీపీసీ మాదిరిగా ఎకరాకు రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కేంద్రాన్ని కోరినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం భూసేకరణ కొనసాగుతున్నది. మొత్తం 4,682 ఎకరాలకు గాను 3,261 ఎకరాలకు అవార్డ్ పాస్ చేసినప్పటికీ ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదు. సుమారు 200 ఎకరాలు అటవీభూమి ఉండగా.. మిగిలిన భూముల విషయంలో రైతుల నుంచి వ్యతిరేకత, కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి.
చౌటుప్పల్, జనవరి 9 : రీజినల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న చౌటుప్పల్, వలిగొం గ్రామాల్లోని నిర్వాసితులు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆందోళనను అడ్డుకునేందు కు పోలీసులు పెద్దఎత్తున మోహరించినా రైతులు లెక్కచేయలేదు. అనంతరం 65వ జాతీయ రహదారిపైన రాస్తారోకో చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భం గా ‘మా భూములు మాకే కావాలి ..కన్న తల్లి ముద్దురా ట్రిపుల్ ఆర్ వద్దురా.. ప్రా ణం పోయినా సరే భూములు ఇవ్వం’ అం టూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. అలైన్మెంట్ మార్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.