హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) నుంచి తెలంగాణకు ఏటా 200 మెగావాట్ల సౌరవిద్యుత్తు అందనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) పథకంలో భాగంగా ఎన్ఎల్సీ 510 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని గుజరాత్లోని కచ్ జిల్లా బిబర్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. ఈ ప్రాజెక్టు విలువ రూ.1,214 కోట్ల అని, 2025 జూన్ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో నుంచి ఏటా తెలంగాణకు 200 మెగావాట్లు సరఫరా చేస్తారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.2.57 కే కిలోవాట్ అవర్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తద్వారా రాబోయే 25 ఏండ్లలో ట్రాన్స్ కోకు రూ.2 వేల కోట్లు ఆదా అవుతుందని వెల్లడించారు. ప్రాజెక్టుకు సోలార్ ప్యానెళ్లతో పాటు సంబంధిత పరికరాలను తెలంగాణ మారెట్ నుంచే కొంటారని చెప్పారు. దీంతో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్ఎల్సీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాలని సూచించారు.