హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): మొంథా తుపాను మిగిల్చిన కొండంత నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం కొసరంత సాయం విడుదల చేసింది. తుపానుతో దెబ్బతిన్న ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి రూ.15 వేల చొప్పున తక్షణ పరిహారం అందించనున్నది. 15 జిల్లాల్లో 8,662 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు ప్రభుత్వం లెక్కతేల్చింది. ఇందుకు సంబంధించి రూ.12.99 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఎక్కువగా పడింది. ఈ జిల్లాల్లో కాలనీలకు కాలనీలే నీట మునిగాయి. వేలాది ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంట్లోని వస్తువులన్నీ నీళ్లపాలయ్యాయి. దీంతో ఒక్కో కుటుంబం కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టపోయింది. కానీ, ప్రభుత్వం రూ.15 వేల చొప్పున మాత్రమే పరిహారం విడుదల చేసింది. తుపాను కారణంగా నష్టపోయినదాంట్లో సగమే పరిహారం ఇస్తే ఎలా అని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రూ.12.99 కోట్లను తక్షణ సాయంగా విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తుపాను వచ్చిన 15 రోజుల తర్వాత సాయం అందిస్తే అది తక్షణ సాయం అవుతుందా? అనే ప్రశ్న వినిపిస్తున్నది. రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభా వం అక్టోబర్ 25 నుంచి ప్రారంభమైంది. 28న భారీ వర్షంతో బీభత్సం సృష్టించింది. నేటికి మొంథా తుఫాను వచ్చి కనీసంగా 15 రోజులు అవుతున్నది. నష్టం సంభవించిన 15 రోజుల తర్వాత పరిహారం అందించిన సర్కారు దీన్ని తక్షణ సాయంగా పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు మాత్రమే పరిహారం విడుదల చేసింది. పంటనష్టం పరిహారం ఊసెత్తలేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. పంటనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు రైతులను నయా పైసా అందలేదు. మొంథా తుపాను కారణంగా 2.53 లక్షల మంది రైతులకు చెందిన 4.47 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే దీనిని తాజాగా 1.1 లక్షల ఎకరాలకు తగ్గించడం గమనార్హం. ప్రాథమిక అంచనాల ప్రకారమైతే రైతులకు రూ.447 కోట్ల పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అదే 1.1 లక్షల ఎకరాలకైతే కేవలం రూ.110 కోట్లు ఇస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు పంటనష్టం అంచనాల్లో కోత పెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.