హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద నియంత్రణ, ముంపు నివారణ కోసం సంబంధిత అన్ని రాష్ర్టాలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆయా బేసిన్లలోని ప్రాజెక్టుల వారీగా గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్‌పై అధ్యయనం జరిపించాలని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్ ప్రతిపాదించారు. స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌లో భాగమైన డ్యామ్ సేఫ్టీ స్టేట్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. హైబ్రిడ్ విధానంలో కొనసాగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నతాధికారులు, ఇద్దరు ఓయూ ప్రొఫెసర్లు, సీడబ్ల్యూసీ మెంబర్ కన్వీనర్ పాల్గొన్నారు. డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం గత ఏడాదిగా చేపట్టిన చర్యలను ఆయా రాష్ర్టాలు వివరించాయి. ఈ సందర్భంగా కమిటీ ఎదుట తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్ పలు ప్రతిపాదనలు పెట్టారు.
విజయవాడ ముంపు లాంటి విపత్తులు భవిష్యత్‌లో తలెత్తకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులను సమన్వయం చేయాలని, వాటిని ఆపరేట్ చేసేందుకు 4 రాష్ర్టాల సీఈలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన వరద ప్రవాహాల తీరుతెన్నులపై ఐఐటీ హైదరాబాద్ లేదా ఐఐటీ రూరీతో అధ్యయనం చేయించాలని, బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్‌ను తయారు చేయాలని కోరారు. రియల్ టైం వర్షపాత వివరాలతోపాటు డాటా ఇంటిగ్రేషన్, రియల్ టైం టెలిమెట్రీ వ్యవస్థల ద్వారా వరదలను అంచనా వేసి నియంత్రించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, వరద నియంత్రణ, ముంపు నివారణ వంటి అంశాలపై ఎగువ, దిగువన ఉన్న రాష్ట్రాలు ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు కమిటీ సానుకూలంగా స్పందించింది.
పెద్దవాగుకు మరో స్పిల్‌వే
ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై పరీక్షలు పూర్తిచేసి నివేదికలను పంపామని, వీటిపై ఎన్డీఎస్ఏ నుంచి ప్రతిస్పందన రావాల్సి ఉన్నదని ఓఅండ్ఎం, ఎస్డీఎస్వో ఈఎన్సీ విజయభాస్కర్‌రెడ్డి కమిటీకి నివేదించారు. వరదలతో తెగిపోయిన పెద్దవాగు ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేసేందుకు 5 గేట్లతో అదనంగా మరో స్పిల్వేని నిర్మించాలని సూచించారు. ఈ పనులకు రూ.92.20 కోట్లు ఖర్చవుతాయని, ఆ నిధుల గురించి ఏపీతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. గుండ్లవాగు ప్రాజెక్టు సమస్యల పరిష్కారం కోసం అక్కడ మళ్లీ కొత్త ప్రాజెక్టును నిర్మించాల్సిందేనని ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ నివేదించినట్టు వెల్లడించారు. తెలంగాణలోని అన్ని మీడియం, మేజర్ ప్రాజెక్టుల వద్ద వానకాలం ముందు, తర్వాత నిర్వహించాల్సిన పరీక్షలను చేయించామని, అనంతరం చేపట్టిన చర్యలపై అధికారుల నుంచి నివేదిక అడిగామని చెప్పారు. 174 స్పెసిఫైడ్ డ్యాముల లిస్ట్ నుంచి పెద్దచెరువు, చెగావ్ ప్రాజెక్టులను తొలగించి వాటి స్థానంలో చనాకా కొరాటా, సదర్మాట్ బరాజ్‌లను చేర్చామని ఈఎన్సీ తెలిపారు. ఓఅండ్ఎం, ఎస్డీఎస్వో ఈఎన్సీ విజయభాస్కర్‌రెడ్డి, సీఈలు సుధాకర్‌రెడ్డి, మోహన్‌కుమార్, అజయ్‌కుమార్, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్, జేఎన్టీయూ ప్రొఫెసర్ శ్రీనివాసులు, సీడబ్యూసీ, ఇతర రాష్ర్టాల అధికారులు పాల్గొన్నారు.
డిండి ప్రాజెక్టు కాలువలకు రూ.1800 కోట్లు
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆ రిజర్వాయర్ నుంచి టన్నెల్, ప్రధాన కాలువల పనులకు రూ.1,800.62 కోట్లతో అనుమతులు జారీ చేసింది. ఆ దిశగా చర్యల చేపట్టాలని అధికారులను ఆదేశించింది.