Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సుల్లో ఏపీ కోటాను కట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి కోటా గడువు పదేళ్లు ముగియడంతో కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ జీవో విడుదల చేసింది. వృత్తివిద్యా కోర్సుల్లో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించింది. 15 శాతం అన్రిజర్వ్డ్ కోటా సీట్ల కేటాయింపులో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.
15 శాతం సీట్లకు 4 రకాల వారిని అర్హులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. తెలంగాణ స్థానికులతో పాటు ఇతర రాష్ర్టాల్లో చదివిన వారు కూడా 15 శాతం అన్ రిజర్వ్డ్ సీట్లకు అర్హులని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఇతర రాష్ర్టాల్లో చదివిన వారు రాష్ట్రంలో పదేళ్లు చదివి ఉండాలని నిబంధన పెట్టింది. కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో పని చేస్తున్న వారి పిల్లలూ 15 శాతం సీట్లకు అర్హులని తెలిపింది.
ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, న్యాయవిద్య, ఫార్మసీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ఈ కోటాను వర్తింపజేయనున్నారు. అయితే ఈఏపీ సెట్‌కు ఈ నెల 25 నుంచి దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉండగా, జీవో జారీ ఆలస్యం కావడంతో ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా జీవో వెలువడటంతో మార్చి 1 నుంచి ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.
రాష్ట్రంలోని 15 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎన్నారై కోటా సీట్లకు అనుమతి ఉండగా వాటి సంఖ్యను 32కు పెంచుతూ ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం 32 కాలేజీల జాబితాను విడుదల చేసింది. ఎన్నారై కోటాలో 15 శాతం సీట్లను ఆయా కాలేజీలు భర్తీ చేసుకునే ఛాన్స్ ఉంది.