హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): మరో రూ.1,000 కోట్ల అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ)కు ప్రతిపాదనలు పంపించింది. నవంబర్ 11న(మంగళవారం)నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంటామని శుక్రవారం ఇండెంట్ పెట్టింది. ఓపెన్ మార్కెట్ రుణ సమీకరణలో భాగంగా ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టి 31 ఏండ్ల కాలానికి రూ.వెయ్యి కోట్లు తీసుకుంటామని ఆర్థికశాఖ ఇండెంట్ పెట్టినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే, ఇప్పటికే రేవంత్ సర్కార్ ఆర్బీఐ నుంచి సుమారు రూ.52వేల కోట్లు అప్పు తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు తీసుకుంటామని బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇప్పటికే రూ.51,900 కోట్ల రుణ సమీకరణ చేశారు. అదనంగా అప్పు కావాలని మూడో త్రైమాసికం కింద రూ.9,600 కోట్లకు ప్రతిపాదనలు పంపించినట్టు ఆర్బీఐ క్యూ-3 క్యాలెండర్లో ప్రకటించింది. క్యూ-3లో భాగంగా అక్టోబర్ 14 రూ.1,000 కోట్లు తీసుకోగా, నవంబర్ 4న మరో రూ.1,000కోట్ల రుణం పొందింది. 11న మరో రూ.1,000 కోట్లు కావాలని ఇండెంట్ పెట్టింది.