హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10,600 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ఓపెన్ మార్కెట్ రుణాల్లో భాగంగా ప్రతి మంగళవారం నిర్వహించే వే లంలో పాల్గొని ఈ మొత్తం సేకరిస్తామని పేర్కొన్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికిగాను (జనవరి-మార్చి) ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టి ఈ మొత్తం రుణాన్ని విడతలవారీగా తీసుకుంటామని ఇండెంట్ పెట్టింది. జనవరిలో రూ.1,600 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 4,000 కోట్లు, మార్చిలో మరో రూ.4,000 కోట్లు ఇలా మొత్తం రూ.10,600 కోట్లు రుణ సమీకరణ చేస్తామని వెల్లడించింది. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ రుణ సమీకరణ 146 శాతానికి చేరుతున్నది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక రుణ సమీకరణ కావడం విశేషం. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక అవసరాల కోసం 2026 జనవరి నుంచి మార్చి వరకు (నాలుగో త్రైమాసికం) జరుపబోయే మారెట్ రుణాల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం, ఈ మూడు నెలల కాలంలో మొత్తం రూ.4,99,821 కోట్ల నిధులను మారెట్ రుణాల ద్వారా ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ ప్రకటించింది.
సొంత ఆదాయ వనరులు పెంచుకోవడంలో విఫలమైన రేవంత్‌రెడ్డి సర్కార్.. అందినకాడికి అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదనే విమర్శలున్నాయి. రాష్ర్టానికి వచ్చే ఆదాయానికి, పెట్టే వ్యయానికి మధ్య పెరుగుతున్న గ్యాప్‌ను పూడ్చేందుకు రుణ సమీకరణ చేస్తున్నది. ఇలా ఇప్పటికే తొమ్మిది నెలల కాలంలో (క్యూ-3 వరకు) ఒక్క ఆర్బీఐ నుంచే రూ.68,300 కోట్ల అప్పు తెచ్చింది. అంటే రుణం 126 శాతానికి చేరింది. ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు కుదవపెట్టి ప్రతి మంగళవారం ఆర్బీఐ నిర్వహించే ఈ వేలంలో పాల్గొని రాష్ట్ర ఆర్థిక రుణ సమీకరణ చేస్తున్నది. ప్రస్తుత ఏడాది ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం కేంద్రం అనుమతించిన, రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రుణ లక్ష్యాన్ని రూ.54,009 కోట్లు రెండు నెలల క్రితమే చేరుకున్నది. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రుణ పరిమితికి వెసులుబాటు కల్పిస్తూ, కేంద్రం పాత రుణాల రీషెడ్యూలింగ్, పునర్వ్యవస్థీకరణకు కూడా అనుమతినిచ్చింది.

01