మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకం అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనేక సందేహాలకు తావిస్తున్నది.
Telangana | హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ): ఓవైపు వానకాలం మొదలైనప్పటికీ చేప పిల్లల పంపిణీ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. వాస్తవానికి ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించాలి. జూలై చివర్లో లేదా ఆగస్టులో చేపల పంపిణీని ప్రారంభించాలి. కానీ ఇప్పటి వరకు పథకం అమలుకు టెండర్ ప్రక్రియ ఊసే లేకపోవడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వం ప్రతియేటా మే నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి జూలై లేదా ఆగస్టులో పంపిణీని ప్రారంభించేది. ఈ విధంగా 2016-17 నుంచి 2023-24 వరకు అంటే ఏడేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో 550 కోట్ల చేప, రొయ్య పిల్లలను విడుదల చేసింది. ఇందుకోసం సుమారు రూ. 523 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు రూ. 32వేల కోట్ల మత్స్య సంపద ఉత్పత్తి అయినట్టు మత్స్యశాఖ పేర్కొంది. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ శాఖకు మంత్రి కూడా లేరు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి వద్దే ఈ శాఖ ఉంది. ఈ నేపథ్యంలో ఏ అంశమైనా సీఎం దృష్టికి తీసుకెళ్లలేక అధికారులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే చేప పిల్లల పంపిణీకి సంబంధించి ప్రభుత్వంతో మాట్లాడేందుకు అధికారులకు మార్గం దొరకడం లేదు. దీంతో ఇప్పటికే రెండుసార్లు పథకం అమలుకు ప్రభుత్వానికి మత్స్యశాఖ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
గతేడాది పంపిణీకి సంబంధించిన బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. సుమారు రూ. 104 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దీంతో గతేడాది చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లుల కోసం ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదిలా ఉంటే చేపల పంపిణీలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపల పంపిణీ పథకం అమలుపై ఆసక్తిగా లేనట్టు తెలిసింది.
ఒకవేళ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నిలిపిస్తే 5 లక్షల మత్స్యకార కుటుంబాలు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 6వేల మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఇందులో అధికారికంగా 3.75 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీళ్లంతా కేసీఆర్ ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో జీవనోపాధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 23 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయినట్టు అంచనా. వీటి అమ్మకం ద్వారా కనీసంగా రూ. 32వేల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు.
చేపల పంపిణీ పథకంతో రాష్ట్రంలో సమృద్ధిగా చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. కేసీఆర్ సర్కారు ఉచిత చేపల పంపిణీ ప్రారంభించడానికి ముందు అంటే 2016-17లో రాష్ట్రంలో కేవలం 2 లక్షల టన్నుల చేపలు మాత్రమే ఉత్పత్తి అయ్యేవి. అది ఇప్పుడు 4.38 లక్షల టన్నులకు పెరిగింది. ఈ విధంగా గడిచిన ఏడేండ్లలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి సుమారు 125 శాతం పెరగడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ పుష్కలంగా చేపలు లభించాయి. వర్షాకాలంలో అయితే మత్తళ్లు దుంకినప్పుడు చేపల వరద పారింది. గతంలో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఏపీ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లు. కానీ చేపల పంపిణీతో ఏపీ నుంచి చేపల దిగుమతి పూర్తిగా బంద్ అయింది. ఇంకా రాష్ట్రం నుంచి ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చేపల పంపిణీ పథకాన్ని నిలిపిస్తే మళ్లీ ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో చేపల ధరలు పెరిగి వినియోగదారులపైనా ప్రభావం చేపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.