హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (ఎంపీడీవో)ను వాహన కష్టాలు వెక్కిరిస్తున్నాయి. అద్దె ప్రాతిపదికన వారు వినియోగించే వాహన బిల్లులను రేవంత్రెడ్డి సర్కారు విడుదల చేయడం లేదు. వారికి నెలవారీగా రూ. 32,300 చొప్పున రావాల్సిన వాహన బిల్లులు గత 15 నెలలుగా రావడం లేదు. దీనిపై ఉన్నతాధికారులను అడిగితే బడ్జెట్ లేదని, రేపిస్తాం.. మాపిస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారని తెలంగాణ ఎంపీడీవో అసోయేషన్ నేతలు వాపోతున్నారు. కొన్ని శాఖల్లోని అధికారులకు రెండు నెలలకోసారి వాహన బిల్లులను చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ సమస్యలను మాత్రం ఖాతరు చేయ డం లేదని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో దాదాపు 200మంది మహిళా ఎంపీడీవోలు సహా మొత్తం 570మంది ఎంపీడీవోలు ఉన్నారు. వారంతా మండల స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులతోపాటు పలు ఇతర పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అందుకోసం వారికి ప్రభుత్వం అద్దె ప్రాతిపదికన వాహన సౌకర్యం కల్పిస్తున్నది. ఆ వాహనాల కిరాయి కోసం ఒక్కో ఎంపీడీవోకి ప్రభు త్వం ప్రతి నెలా రూ.32,300 చొప్పున చెల్లించాల్సి ఉన్నది.
ఈ క్రమంలో 2023 మార్చి వరకు ఎంపీడీవోల వాహన బిల్లులన్నీ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం క్లియర్ చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు వాహన బి ల్లులు క్లియర్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16నెలలు గడుస్తున్నా ఒక్కసారి కూడా ఎంపీడీవోల వాహన బిల్లులను విడుదల చేయలేదు. అలా నెలకు రూ.1.84 కోట్ల చొప్పున గత 24నెలలకు కలిపి మొత్తం రూ.44.18 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టడంతో ఎంపీడీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత డబ్బు తో వాహన కిరాయిలు చెల్లించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. వాహన బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొం టున్నారు. ప్రభుత్వం స్పందించి వాహన బిల్లులు విడుదల చేయాలని తెలంగాణ ఎంపీడీవోల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం ఎంపీడీవోలు 570 మంది
నెలవారీగా ఒక్కో ఎంపీడీవోకు రావాల్సిన వాహన కిరాయి రూ.32,300
ప్రతినెల ప్రభుత్వం ఇవ్వాల్సింది రూ.1.84 కోట్లు
ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న బిల్లులు రూ.44.18 కోట్లు