హైదరాబాద్, నవంబర్4 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధుల సమీకరణ అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులను జారీచేశారు. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) సూచనలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకే ప్రభుత్వం ఈ ప్రత్యేక కమిటీని నియమించింది. సంక్షేమశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా, ఆర్థిక శాఖ సెక్రటరీ వైస్ చైర్మన్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా, విద్య, ఎస్సీ, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమం, ఉన్నత విద్య శాఖల అధికారులతోపాటు ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాం, ఫతి అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్రతినిధులను కలిపి మొత్తంగా 13మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ ట్రస్ట్ ద్వారా ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం అమలు, పారదర్శకత, హేతుబద్ధీకరణ, తదితర అంశాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని కమిటీకి మార్గదర్శకాలను విడుదల చేసింది.
మళ్లీ కాలయాపనకే కమిటీ!
ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమిస్తూ కొత్త నాటకానికి తెరతీసిందని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ కాలయాపన కోసమేనని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2,500కు పైగా ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. నిబంధనల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి బకాయిలను చెల్లించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ పథకానికి సంబంధించి బకాయిల చెల్లింపునే నిలిపేసింది. దీంతో అవి రూ.10 వేల కోట్లుకు పైగానే పేరుకుపోయాయి. ఆ నిధుల విడుదల కోసం కాలేజీ యాజమాన్యాలు గతంలో కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చారు.
అదీగాక విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వకుండా పరోక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. విద్యార్థి సంఘాలు, బీసీ, ఎస్టీ, ఎస్సీ సంఘాలు సైతం నిధుల విడుదల కోసం పోరాటాలకు దిగాయి. ఎప్పటికప్పుడు వాయిదాలతో సర్కారు దాటవేస్తూ వస్తున్నది. నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం రూ.1,207 కోట్లకు టోకెన్లు జారీచేసినా ఒక్క రూపాయి విదిల్చలేదు. ఇటీవల ఆ నిధులను దీపావళిలోపు విడుదల చేస్తామని హామీనిచ్చినా కేవలం రూ.300 కోట్లే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు మళ్లీ పోరుబాట పట్టాయి. అప్పటికీ సర్కారు పట్టించుకోవడం పక్కనపెట్టి ఎదురుదాడికి దిగింది. కాలేజీలపై విజిలెన్స్ సోదాలకు ఆదేశించింది. అయినా యాజమాన్యాలు వెరవకుండా సోమవారం నుంచి కాలేజీలను బంద్ పెట్టి రోడ్డెక్కాయి.
ఫతి సూచనలు ఇవే..
రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 10వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఆ నిధులు విడుదల చేయాలని దీర్ఘకాలంగా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయమై గతంలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో ఫతి ప్రతినిధులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పథకం అమలు కోసం ప్రత్యేకంగా రూ.లక్ష కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల నుంచి సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులతోపాటు, పథకం అమలు కోసం ప్రభుత్వం కొంత మొత్తం నిధులను ట్రస్ట్‌కు కేటాయించాలని కోరారు. ఆ ట్రస్ట్ ద్వారా పథకాన్ని అమలు చేయాలని, తద్వారా ప్రభుత్వానికి ఆర్థికభారం ఉండబోదని అసోసియేసన్ తెలిపింది.