హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మరోసారి నిరాశపర్చింది. ఎన్నికల హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా ధోకా ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ మున్సిపాలిటీల్లో బీసీలకు కేవలం 30% రిజర్వేషన్లు కల్పించింది. బుధవారం మున్సిపల్ శాఖ రిజర్వేషన్లు ఖరారుచేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో-14 జారీచేసింది. తెలంగాణలో జనాభా లెక్కలు-2011 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించారు. సీపెక్ సర్వే-2024 ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మున్సిపల్ యాక్ట్-2019 ప్రకారం మొత్తం సీట్లలో మహిళలకు 50% రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలోని మొత్తం పురపాలక సంస్థలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. అలాగే వార్డులవారీగా రిజర్వేషన్లు ఖరారుచేస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీచేశారు. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవుల రిజర్వేషన్లు కూడా కేటాయించారు. ఈ వివరాలను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలోనే మోగే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్పర్సన్ రిజర్వేషన్లను సైతం ఖరారు చేశారు. ఎస్టీలకు ఐదు సీట్లు (జనరల్-3, మహిళలు-2), ఎస్సీలకు 17 (జనరల్-9, మహిళలు-8), బీసీలకు 38 స్థానాలు (జనరల్-19,మహిళలు-19), మహిళలకు 31 స్థానాలు, అన్ రిజర్వుడ్ స్థానాలు 30 ఖరారు చేశారు. రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్ రిజర్వేషన్ల వివరాలను కూడా వెల్లడించారు. ఎస్సీకి ఒక స్థానం, ఎస్టీకి ఒకటి, బీసీ జనరల్ రెండు, బీసీ మహిళలు ఒకటి, మహిళలు జనరల్ నాలుగు, అన్ రిజర్వుడ్ స్థానం ఒకటి కేటాయించారు.