హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ) : నిపుణుల సలహాలు, సాంకేతిక పరీక్షలు నిర్వహించిన అనంతర మే ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పనులపై ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యయనాలు ఏవీ లేకుండా ముందుకెళ్లొద్దనే అభిప్రాయానికీ వచ్చింది. ఆ యా అంశాలపై చర్చించేందుకు శుక్రవారం టెక్నికల్ సబ్ కమిటీ సభ్యుల సమావేశాన్ని ప్రత్యేక ఏర్పాటుచేసింది. ప్రమాద ఘటనపై అధ్యయనం చేసేందుకు, సహాయ చర్యలను ముమ్మరం చేసి ఆరుగురు కార్మికుల మృతదేహాలను త్వరితగతిన వెలికితీసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసి.. సిఫారసులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 12మందితో ఒక టెక్నికల్ కమిటీని నియమించింది.
పర్యావరణ మంత్రిత్వ శాఖ విధించిన షరతుల మేరకు అధ్యయనం చేసి పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించి, సాంకేతిక నిపుణులతో మరో ఉపసంఘా న్ని ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. సొరంగ నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైనింగ్, ఫ్యూయల్ రీసెర్చ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి నిపుణులతో కూడిన ఉప-కమిటీని ఏర్పాటుచేసింది.