హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కేవలం 11 నెలల్లోనే ఆయనను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడం వల్లే ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ. 37 వేల కోట్ల ఆదాయం సమకూరుతున్నది. ఇప్పుడీ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ. 47 వేల కోట్లకు పెంచింది. దీనికి అనుగుణంగా ఎక్సైజ్ అధికారులు తమ కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు ఇచ్చారు. అందులో భాగంగా ఒక్కో మద్యం దుకాణానికి రూ. 50 లక్షల టార్గెట్ విధించినట్టు తెలిసింది. ఆ మేరకు అమ్మకాలు పెంచడంలో విఫలమైన అధికారులకు ఇటీవల మెమోలు కూడా ఇచ్చారు.
ఆదాయం కోసం కొందరు ప్రభుత్వ పెద్దలు ఆడుతున్న బదిలీల ఆటలో ఎక్సైజ్ కమిషనర్లు బలవుతున్నారు. గతంలో పనిచేసిన ముషారఫ్ అలీ ఫరూఖీ స్థానంలో ఈ శ్రీధర్‌ను తీసుకొచ్చారు. ఆయన కూడా ఆదాయం పెంచడంలో విఫలం కావడంతో బదిలీ వేటు పడింది. రాష్ట్రంలోని 19 జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా తగ్గడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. లక్ష్యాన్ని చేరుకునేలా ఎక్సైజ్ అధికారులను పరుగులు పెట్టించడంలో శ్రీధర్ విఫలమవుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఆయనను బీసీ శాఖకు బదిలీ చేసినట్టు చెప్తున్నారు. అధికారులకు అదనంగా లక్ష్యాలు విధించడం ద్వారా కనీసం 20 శాతానికి పైగా మద్యం విక్రయాలు జరుగుతాయని ఆశించారు. అయితే, ఆదాయం పెరగడానికి బదులు అమ్మకాలు మైనస్‌లోకి వెళ్లడంతో ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు సోమవారం నాటి బదిలీల్లో శ్రీధర్ పేరును చేర్చారు. ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న చెవ్వూరి హరికిరణ్‌కు బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుండడం, అధికారులకు మెమోలు ఇస్తుండటంపై మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం సిగ్గుచేటు. మద్యం అమ్మకాల లక్ష్యాలను చేరుకోనందుకు 30 మంది ఎక్సైజ్ సరిల్ ఇన్స్పెక్టర్లకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మెమోలు జారీ చేయడం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని డొల్లతనాన్ని బయట పెడుతున్నది. మద్యం అమ్మకాలు అరికడతామని, బెల్టు షాపులను మూసివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మద్యం అమ్మకాల పెంచాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లను ఒత్తిడి చేయడం ద్వంద వైఖరికి నిదర్శనం.
ఎక్సైజ్ అధికారులు తమ సరిళ్లలో అమ్మకాలను 10 శాతం నుంచి 25శాతం పెంచాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం, విక్రయ లక్ష్యాలను చేరుకోకపోతే బదిలీ చేస్తామని బెదిరించడం దుర్మార్గం.ఆదాయం పెంచుకునేందుకు 1.7 లక్షల బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పనిచేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడం శోచనీయం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 11 నెలలలో సాధించిన ‘మార్పు’ ఇదే!!’ అంటూ ఎక్స్ వేదికగా హరీశ్ నిప్పులు చెరిగారు.