హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికలకు నగా రా మోగింది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూ ల్ విడుదలైంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. హైదరాబాద్ ఏసీగార్డ్స్‌లోని ఎస్ఈసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో కిక్కిరిసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. మొత్తం ఏడు కార్పొరేషన్లలోని 414 వార్డులకు, 32 జిల్లాల్లోని 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
బుధవారం ఉదయం 10.30 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వెల్లడించారు. 31న నామినేషన్ల పరిశీలన, అనంతరం చెల్లుబాటైన అభ్యర్థుల జాబితా ప్రచురిస్తామని చెప్పారు. నామినేషన్ల తిరస్కరణపై ఫిబ్రవరి 1న అప్పీల్ చేసుకోవచ్చని, దాఖలైన అప్పీళ్లను 2న పరిష్కరిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3 గంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ కాగా, బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు.
సుమారు వారంపాటు ప్రచారం కోసం అభ్యర్థులకు అవకాశం ఉంటుందని, ఫిబ్రవరి 11న ఉదయం 7 నుంచి సాయంతం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. రీపోలింగ్ అవసరమైతే 12న నిర్వహిస్తామని తెలిపారు. 13న ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. 16న మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారని చెప్పారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,00 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వివరించారు.
రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికలు జరుగుతాయని కమిషనర్ రాణికుముదిని వెల్లడించారు. బ్యాలట్ పేపర్ ద్వారా జరిగే ఎన్నికల కోసం 16,031 బ్యాలట్ బ్యాక్సులు రెడీ చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 136 కేంద్రాలను సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, ఎన్నికల కోడ్ అమలు, ఇతర అంశాలను పరిశీలించేందుకు అధికారుల బృందాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. వారికి శిక్షణ కూడా ఇచ్చామని వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని అన్ని పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఉంటుందని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా రికార్డింగ్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా పాటించాలని, స్వేచ్ఛగా, నిర్భయంగా, నిష్పాక్షికంగా ఓటు వేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఓటర్లకు, అభ్యర్థులకు విజ్ఞప్తిచేశారు. ఓట్ల పండుగకు హాజరై 85 శాతానికిపైగా పోలింగ్ నమోదయ్యేలా సహకరించాలని కోరారు.


రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పౌరులు తమ వెంట రూ.50 వేల నగదును మించి తీసుకెళ్లడానికి అనుమతి లేదని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ చెప్పారు. రూ.50 వేలకు మించితే రసీదు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల బందోబస్తు కోసం 26 వేల మందిని కేటాయించినట్టు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఫారెస్టు, ఎక్సైజ్ సిబ్బందిని తీసుకున్నట్టు వెల్లడించారు. 1,926 సమస్యాత్మక ప్రాంతాలను, 300కు పైగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.
నిర్మల్, భైంసా, బోధన్, నిజామాబాద్ మరికొన్ని ప్రాంతాలను కమ్యూనల్ సెన్సిటివ్ ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. పోలీసు తనిఖీల కారణంగా మేడారం వెళ్లే సాధారణ భక్తులు అసౌకర్యానికి గురికాకుండా పోలీసులకు ప్రత్యేక సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. 1,800 లైసెన్స్డ్ ఆయుధాలను రికవరీ చేసుకున్నామని, ఇంకా ఎక్కడైనా అక్రమంగా ఆయుధాలు ఉంటే సీజ్ చేస్తామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడు అంచెల బందోబస్తు ఉంటుందని, రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తామని, ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటు వేసే వాతావరణం ఉంటుందని వెల్లడించారు.
రాష్ట్రంలో మొత్తం 133 మున్సిపాలిటీలు ఉండగా, పాలకవర్గాల గడువు తీరిన, కొత్తగా ఏర్పడిన ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పురపాలకశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి చెప్పారు. ఫొటోలతో కూడిన ఓటర్‌కార్డులు ఇప్పటికే సిద్ధం చేశారని, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి రిజర్వేషన్లు ఖరారు చేశామని తెలిపారు. చట్టాలు, నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లు కేటాయించినట్టు వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. సమావేశంలో ఎస్ఈసీ కార్యదర్శి లింగ్యానాయక్, ఎన్నికల పర్యవేక్షకుడు మందా మకరంద్ పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఎస్ఈసీ ప్రకటించారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019లోని సెక్షన్ 20 ప్రకారం.. ఆయా పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు కోసం అధికారులు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజు 14న లేదా అంతకుముందే నోటీసులు ఇవ్వాలని షెడ్యూల్లో సూచించారు. ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటల నుంచి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రత్యక్షంగా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయాలని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత మున్సిపాలిటీ చైర్పర్సన్/వైస్‌చైర్‌పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని కమిషనర్ సూచించారు. చైర్పర్సన్/ మేయర్ ఎన్నికలు పూర్తయ్యేవరకు వైస్ చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. ఏ కారణం చేత అయినా ఆ పదవుల ఎన్నిక జరుగకపోతే మరుసటి రోజు నిర్వహించాలని స్పష్టంచేశారు.


నోటిఫికేషన్ విడుదల: 28.01.2026
నామినేషన్ల స్వీకరణ: 28.01.2026 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
నామినేషన్ల దాఖలు చివరి తేదీ: 30.01.2026 సాయంత్రం గంటల వరకు
నామినేషన్ల పరిశీలన:31.01.2026 ఉదయం 11 గంటల నుంచి
చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితా: 31.01.2026 నామినేషన్ల పరిశీలన పూర్తయిన వెంటనే
నామినేషన్ల తిరస్కరణపై అప్పీల్:01.02.2026 సాయంత్రం 5 గంటల వరకు
అప్పీళ్ల పరిష్కారానికి గడువు: 02.02.2026 సాయంత్రం 5 గంటలలోపు
నామినేషన్ల ఉపసంహరణ గడువు: 03.02.2026 మధ్యాహ్నం 3 గంటలలోపు
పోటీచేసే అభ్యర్థుల తుదిజాబితా ప్రకటన:03.02.2026 మధ్యాహ్నం 3 గంటల తర్వాత
పోలింగ్ తేదీ: 11.02.2026 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
రీపోలింగ్ అవసరమైతే : 12.02.2026
ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ:13.02.2026 ఉదయం 8 గంటల నుంచి

ఉంటే ఆధారాలు పక్కాగా చూపించాల్సిందే అమల్లోకి మున్సిపల్ ఎన్నికల కోడ్: డీజీపీ
హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ‘మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు రూ.50 వేలకు మించి ఎక్కువ నగదు తీసుకెళ్లొద్దు. ఒకవేళ ఎక్కువ నగదు ఉంటే పక్కా ఆధారాలు చూపించాల్సిందే’ అని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బీ శివధర్‌రెడ్డి స్పష్టంచేశారు. షెడ్యూల్ ఖరారుతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణలో భద్రతా ఏర్పాట్లపై మంగళవారం ఆయన సమీక్షించారు.
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఉచితాల పంపిణీని అడ్డుకోవడానికి తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లయింగ్ స్వాడ్లను రంగంలోకి దించుతామని చెప్పారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలను వెంటనే డిపాజిట్ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో 24/7 పనిచేసేలా ప్రత్యేక ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రోడ్డు భద్రతపై సర్వేజన ఫౌండేషన్ రూపొందించిన ‘భద్రం నాన్న’ అనే షార్ట్ ఫిల్మ్‌ను డీజీపీ శివధర్‌రెడ్డి తన కార్యాలయంలో ఆవిషరించారు.