Meinhardt | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘మెయిన్‌హార్ట్ ఎంతో పెద్ద కన్సల్టెన్సీ. మెయిన్‌హార్ట్ కంపెనీకి ప్రధాని మోడీ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అందుకే హైదరాబాద్ నగర సమగ్ర ప్రాజెక్టు నివేదిక బాధ్యతను ఆ కంపెనీకి అప్పగించాం’ ఇదీ… సీఎం రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణపై నిర్వహించిన మీడియా సమావేశంలో మెయిన్‌హార్ట్ కంపెనీపై కురిపించిన ప్రశంసల జల్లు. మరి ఇంత గొప్ప కంపెనీ చేసిన అద్భుతాలను చూడాలనే ఆత్రుత ప్రతి ఒక్కరికీ ఉండటం సహజం. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడి యా ప్రతినిధులతో కూడిన ఒక బృందాన్ని రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును సందర్శించేందుకు విదేశీ పర్యటన ఖరారు చేసింది.
కానీ రేవంత్ ప్రభుత్వం మెయిన్‌హార్ట్ కంపెనీకి ఎలాంటి సంబంధంలేని రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించేందుకు సదరు బృందాన్ని దక్షిణ కొరియాలోని సియోల్ తీసుకుపోతున్నది. మరి… ఆ కంపెనీ పని తీరు ఏందో సదరు బృందానికి చూపిస్తే కదా… వాళ్లంతా ఇక్కడికి వచ్చి సీఎం రేవంత్ చెప్పినట్టు మెయిన్‌హార్ట్ అద్భుతాలను సృష్టించే అమోఘమైన కంపెనీ అని తెలంగాణ ప్రజలకు చెప్పేవాళ్లు. కానీ ఎందుకు ఇతర ప్రాజెక్టు సందర్శనకు బృందాన్ని తీసుకుపోవడం వెనుక మర్మమేమిటి? ఇదే ఇప్పుడు అందరిలో కలుగుతున్న సందేహం.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ అడుగులు అనుమానాస్పదంగానే ఉన్నాయి. అంచనా వ్యయం పెరగడం..పేదల ఇండ్లను కూల్చివేయడం, మాస్టర్‌ప్లాన్ ఈవోఐ టెండర్లలో గోల్మాల్ చేసి మెయినహార్ట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించడం.. ఇలా ప్రతి దశలోనూ మూసీ ప్రాజెక్టు వెనుక అనుమానాలు ఉన్నాయి. ఇటీవల మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెయిన్‌హార్ట్ కంపెనీ ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీగా చెప్పారు. గతంలో ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు ఆ కంపెనీ చేసి చూపించిందని సచివాలయంలోనే గ్రాఫిక్స్ రూపంలో ప్రదర్శించారు. అలాంటప్పుడు మూసీ లెక్కనే ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఆ కంపెనీ చేపట్టి, పూర్తి చేసిన ప్రాజెక్టులను సందర్శించేందుకు ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులను తీసుకుపోవడంలో అర్థముంటుంది.
మూడు చోట్లా మూడు కథలు…
సియోల్‌కు మెయినహార్ట్కు సంబంధం ఏంది?
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు మీడియా ప్రతినిధులను ఆదివారం దక్షిణ కొరియాలోని సియోల్‌కు తీసుకెళ్తున్నది. ఈ నెల 21-24వ తేదీ వరకు బృందం అక్కడ పర్యటించి, రివర్‌ఫ్రంట్‌ను పరిశీలిస్తుందని ఈ నెల 14న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. విదేశీ పర్యటనకు వెళ్లినపుడు ఆ బృందం ఏ ప్రాంతంలో, ఏమి పరిశీలిస్తుందనే వివరాలను పొందుపరచడం సర్కారు కనీస బాధ్యత. కానీ రేవంత్ ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో సదరు బృందం ఏ నదిని సందర్శిస్తుందో కనీసం పొందుపరచకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. నది పేరును దాచాల్సిన అవసరమేముందనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు సియోల్‌లో ఉన్నది చియోంగ్‌చియాన్ అనే రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు. అది కూడా వాగుపై చేపట్టిన ప్రాజెక్టు. దానిని అక్కడి సియోల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ప్రభుత్వపరంగానే చేపట్టారు. మరి మూసీని ఉద్దరించనున్న మెయిన్‌హార్ట్ కంపెనీకి థాయిలాండ్ ప్రభుత్వమే చేసిన చియోంగ్‌చియాన్ అనే రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ఏం సంబంధమో కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలియాలి.