Nirmala Sitharaman | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెవెన్యూ మిగులుతో ఉండేది. పదేండ్లలో అప్పుల్లో మునిగిపోయింది’.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. అంతేకాదు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చిందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆర్థిక నిపుణలు, తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు గురివింద గింజను తలపిస్తున్నాయని మండిపడుతున్నారు. పదేండ్లలో తెలంగాణ చేసిన అప్పుల గురించి మాట్లాడిన నిర్మలా సీతారామన్.. అదే పదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ఎందుకు ప్రశంసించలేదని ప్రశ్నిస్తున్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీ, సొంత పన్ను ఆదాయం, బడ్జెట్.. ఇలా ఆర్థిక వృద్ధికి కొలమానాలుగా పిలిచే అన్ని ప్రమాణాల్లోనూ తెలంగాణ సాధించిన విజయాలను ఎందుకు
రాజ్యసభలో తెలంగాణ అప్పులను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి.. తమ హయాంలో చేసిన దేశ అప్పులను ఎందుకు వివరించలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికి దేశ అప్పులు రూ.62.78 లక్షల కోట్లు మాత్రమే. కానీ.. పదేండ్ల తర్వాత 2024-25 నాటికి అప్పులు రూ.181.74 లక్షల కోట్లకు చేరాయి. అంటే రూ.119 లక్షల కోట్లు పెరిగింది. పదేండ్లలో మూడు రెట్ల అప్పులు పెంచిన ఘనతను ఎందుకు పెద్దల సభలో చెప్పుకోలేదని ఎద్దేవా చేస్తున్నారు. తాజా బడ్జెట్ లెక్కల ప్రకారం ఈ ఏడాది మరో రూ.15 లక్షల కోట్ల అప్పులు చేయనున్నారని, మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నిస్తున్నారు.
విభజన చట్టంలోని హామీలను దాదాపు నెరవేర్చామని కేంద్ర మంత్రి చెప్పడంపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. పైగా తాము మాటలతో కాకుండా చేతల ద్వారా సమాధానం ఇస్తున్నామనడంపై మండిపడుతున్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని ప్రశ్నిస్తున్నారు. షెడ్యూల్ 9,10లోని సంస్థల విభజన ఇంకా పెండింగ్లో ఎందుకు ఉన్నదని నిలదీస్తున్నారు. ఇలా ప్రధాన సమస్యలను నెరవేర్చకుండా పూర్తి చేశామని చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.