TGCHE | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తేతెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు ‘అటానమస్’ హోదా చినికిచినికి గాలివానలా మారుతున్నది. ఈ వ్యవహారం యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) మధ్య వివాదానికి దారితీసింది. తమను సంప్రదించకుండానే తమ పరిధిలోని కాలేజీలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చేందుకు అత్యుత్సాహం ఎందుకని ఉన్నత విద్యామండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు ఘాటుగా లేఖ రాసినట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
కాలేజీలకు ఫుల్ డిమాండ్
యూజీసీ అటానమస్ హోదా ఉన్న కాలేజీలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ కళాశాలల్లో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో విద్యార్థులు ఈ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారు. ఈ కాలేజీల్లో అడ్మిషన్లయితే అటానమస్ కల్పించే విషయంలో తమ ప్ర మేయం లేకుండా చర్యలెలా తీసుకుంటారని ఉన్నత విద్యామండలి అడ్డు చెప్తున్నది.
గ్రేడ్ల మార్పుతో చిక్కులు
గతంలో న్యాక్ ఏ గ్రేడ్, లేదంటే కనీసం మూడు కోర్సులు 675 స్కోర్‌తో ఎన్‌బీఐ గుర్తింపు ఉంటే అటానమస్ హోదా ఇచ్చేవారు. ఇటీవల ఈ నిబంధనల్లో యూజీసీ మార్పులు చేసింది. ఏ గ్రేడ్‌కు బదులు బీ గ్రేడ్ ఉన్నా అటానమస్ కల్పిస్తున్నది. దీంతో ఈ హోదా ఉన్న ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల సంఖ్య 430కి చేరిందని విద్యామండలి అధికారులు చెప్తున్నారు. అటానమస్ హోదా ఉన్న కాలేజీలకు పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం అంతా ఆ యా కాలేజీల పరిధిలోనే ఉంటుంది.