Congress | హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఘోర పరాభవం ఎదురవడం తెలంగాణ కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నది. అక్కడ 44 స్థానాల నుంచి 16 స్థానాలకు పతనమై అతిపెద్ద పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఇక్కడి నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఈ ‘మహా’ ఓటమి ప్రభావం తెలంగాణపై పడుతుందనే గుబులు వారిలో కనిపిస్తున్నది. వరుస ఓటములతో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారుతున్నదన్న ఆందోళన వ్యక్తమవుత్నునది. అటు పార్టీ, ఇటు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా నడుస్తున్నది. ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాకముందే ప్రజావ్యతిరేకతను మూటకట్టుకోగా అటు జాతీయ స్థాయిలో ప్రజాభిమానాన్ని చూరగొనడంలో పార్టీ విఫలమయిందనే అభిప్రాయాలు కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో ఇంతటి ఘోర పరాజయాన్ని ఊహించలేదని పార్టీ నేతలే చెప్తున్నారు. 101 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లోనే గెలిచింది. ఒక జాతీయ పార్టీ ఇంత ఘోర పరాజయం మూటగట్టుకోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీపై ప్రజావ్యతిరేకత ఎంత ఉన్నదో ఈ ఫలితాలే స్పష్టంచేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌ను దశాబ్దం నుంచి వరుస ఓటములు వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కొంత పుంజుకున్నట్టు కనిపించినా ఆ తర్వాత డీలా పడిపోయింది. ఇటీవల జరిగిన పలు రాష్ర్టాల ఎన్నికల్లోనూ పార్టీ ఓటమిని మూటగట్టుకున్నది. హర్యానా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తాజాగా మహారాష్ట్రలో భంగపాటే ఎదురైంది. ప్రస్తుతం కాంగ్రెస్ దేశంలోని కేవలం మూడు రాష్ర్టాల్లోనే అధికారంలో ఉండడం గమనార్హం.
గ్యారెంటీల విఫలంపై అంతర్మథనం
మహారాష్ట్ర ఎన్నికల్లో ‘తెలంగాణ ఆరు గ్యారెంటీల’ మంత్రం పని చేయకపోవడంతో ఇక్కడి నేతల్లో అంతర్మథనం మొదలైందనే చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డితో పా టు మంత్రివర్గమంతా మహారాష్ట్రలో ప్రచారం చేసి ఆరు గ్యారెంటీల గురించి కోడై కూసినా అక్కడి ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏడాది అవుతున్నా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేక ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమేననే భావన కాం గ్రెస్ కీలక నేతల్లో వ్యక్తమైనట్టుగా తెలిసింది. తర్వలోనే ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆందోళనగా ఉన్నట్టు తెలిసింది.