బెంగళూరు కేంద్రంగానే వ్యూహరచన
హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): మాయలఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ నేతల జుత్తు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేతిలో ఉన్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం డీకే శివకుమార్ కనుసన్నల్లోనే నడుస్తున్నదని, ఎన్నికలకు సంబంధించి తెరవెనుక తతంగం మొత్తం ఆయనే చూసుకుంటున్నారని గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు బెంగళూరు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
మొదట్లో రేవంత్‌రెడ్డికి కొంత స్వేచ్ఛ ఇచ్చిన అధిష్ఠానం.. ఎన్నికల వ్యవహారంలో ఆయనపై పూర్తిగా ఆధారపడొద్దనే నిర్ణయానికి వచ్చిందనే ప్రచారం జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గీయులైన జగ్గారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఎన్నికల కమిటీలో చేర్చడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయ గురువు చంద్రబాబు బీజేపీ స్నేహం కోసం అర్రులు చాస్తుండటం, రేవంత్‌కి ఆరెస్సెస్ నేపథ్యం ఉండటంతో ఆయనను గుడ్డిగా నమ్మి తే ఏ సమయంలోనైనా పార్టీని ముంచే ప్రమాదం ఉన్నదని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే డీకేకు కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానం ఏ విషయమైనా ఆయనతో చర్చించాలని రేవంత్‌రెడ్డికి సూచించిందని భావిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన మొత్తం వ్యవహారం బెంగళూరు కేంద్రంగానే నడుస్తున్నది. ప్రణాళికల రూపకల్పనలో సైతం తెలంగాణ నేతలను భాగస్వాములను చేయడం లేదని తెలిసింది. ఎన్నికల స్ట్రాటజీ, అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో కూడా బెంగళూరులోనే రూపొందిస్తున్నట్టు తెలిసింది. అక్కడ రూపొందించిన ప్ర ణాళికలను ఇక్కడ అమలు చేసే బాధ్యతను మాత్రమే రాష్ట్ర నేతలకు అప్పగించారు. పార్టీ వ్యూహకర్త సునీల్ తన ఆఫీసును బెంగళూరు కేంద్రంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ అధిష్ఠానంతోపాటు కర్ణాటక అధిష్ఠానం కూడా మొగుడుగా మారినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.