హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రం లో లేనివిధంగా అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. టీఆర్ఎస్కేవీ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాంబాబు.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సీఎం కేసీఆర్ మూడు సార్లు వేతనం పెంచి ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా రాంబాబు యాదవ్, అధ్యక్షురాలిగా నల్లా భారతి, ప్రధాన కార్యదర్శిగా విలాసకవి నిర్మల, కోశాధికారిగా వేదవతి, ఉపాధ్యక్షురాలిగా రమాదేవి, రాణి, అరుణ, సహాయ కార్యదర్శులుగా విమల, కృష్ణకుమారి, కమిటీ సభ్యులుగా శిరీష, రాధ, ఎల్లమ్మ, రామాతార, లీలావతి, నాగలక్ష్మి, సుజాత, సైదమ్మ, దాడి అరుణ, సురేఖ, అరుణ, వరలక్ష్మి, నాగమణి ఎన్నికయ్యారు. సమావేశంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.