Budget 2025 | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీలో సమావేశం కానున్నది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ రూపొందించిన బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నది. అనంతరం 11:14 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా, శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ.3.10 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్టు ఇప్పటికే ఆర్థికశాఖ వర్గాలు లీకులిచ్చాయి. గతేడాది బడ్జెట్ కన్నా దాదాపు 7% అదనంగా బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నాయి.
అప్పులపైనే భారం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.64 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, జనవరి నాటికి కేవలం రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే వచ్చిందని కాగ్‌కు ఇచ్చిన నివేదిక వెల్లడించింది. మార్చి చివరి నాటికి రూ.1.25 లక్షల కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నది. అయితే.. కీలక రంగాల్లో స్తబ్ధత కొనసాగుతుండటంతో ఈ ఏడాది కూడా పన్ను ఆదాయం అంచనాలను చేరుకోవడం కష్టమేనని చెప్తున్నారు. ముఖ్యంగా జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో స్తబ్ధత, స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అంచనాల్లో సగం కూడా రాకపోవడం, ధరల పెంపుతో ఎక్సైజ్ అమ్మకాలు తగ్గిపోవడం వంటి కారణాలతో రాబడులు తగ్గుతాయని పేర్కొంటున్నారు. మొత్తంగా ప్రభుత్వం అంచనాల్లో దాదాపు రూ.40-45 వేల కోట్ల వరకు లోటు ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పులు, భూముల అమ్మకాలపైనే ఆధారపడక తప్పదని స్పష్టం చేస్తున్నారు. బడ్జెట్ రుణాలు గతేడాది రూ.60 వేల కోట్ల వరకు ప్రతిపాదించగా, ఈసారి రూ.80 వేల కోట్ల వరకు తీసుకోవచ్చని చెప్తున్నారు.
వ్యవసాయానికి కోతలేనా?
తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా కోతలు విధించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. 2024-25లో వ్యవసాయ రంగానికి రూ.49,383 కోట్లు కేటాయించా రు. ఇందులో రుణమాఫీకే రూ.26 వేల కోట్లు వెచ్చించారు. ప్రభుత్వం రుణమాఫీ పూర్తయిందని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ మేరకు నిధులు తగ్గించే అవకాశం ఉన్నదని సమాచారం. దాదాపు రూ.25-30 వేల కోట్లు వ్యవసాయానికి కేటాయించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో నిధులు కేటాయించే అవకాశం ఉన్నదని సమాచారం.
తూతూమంత్రపు కేటాయింపులేనా?
గత బడ్జెట్లో అనేక పథకాలు, కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయించినా, వాటిని వినియోగించలేదు. ఇదే తరహాలో ఈసారీ తూతూమంత్రపు కేటాయింపులే ఉండొచ్చంటున్నారు. 2024-25లో పంటలబీమాకు రూ.1300 కోట్లు కేటాయించినా అమలు చేయలేదు. రెండు దఫాల్లో రైతు భరోసా పథకానికి రూ.15వేల కోట్లు కేటాయించినా.. ఒక్కసారి మాత్రమే విడుదల చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూ. 7,740 కోట్లు కేటాయించగా ఒక్క రూపాయి వినియోగించలేదు. సీఎం దళిత సాధికారత పథకానికి రూ.2 వేల కోట్లు కేటాయింపులకే పరిమితమయ్యాయి.