హనుమకొండ చౌరస్తా, నవంబర్ 19: చేతులెత్తి మొక్కుతున్నా.. పసికందులను చెత్త కుప్పల్లో, ముళ్లపొదల్లో వేయొద్దని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ వేడుకున్నారు. బాలల హకుల వారోత్సవాల్లో భాగంగా నిరాదరణకు గురైన పిల్లల రక్షణ, సంరక్షణ కోసం శనివారం ఆయన హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్) ఆవరణలో ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో ఊయల ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, పిల్లలు వద్దనుకొనేవారు ఈ ఊయలలో వేయాలని సూచించారు. ఒక అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, తల్లిదండ్రులను ఆర్థిస్తున్నానన్నారు. పిల్లలను వద్దనుకుంటే ఊయలలో కానీ నేరుగా గానీ దత్తత విభాగం అధికారులను సంప్రదించాలని సూచించారు. ముందుగా జీఎంహెచ్‌లో ప్రారంభించామని, తర్వాత బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో ఊయలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.