హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వ పాలనలో సివిల్ సర్వెంట్ల పాత్ర కీలకమని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్ పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సివిల్ సర్వెంట్ల కోసం రూపొందించిన ఫౌండేషన్ కోర్సును ప్రారంభించి మాట్లాడారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, బిగ్‌డేటా లాంటి ఆధునాతన సాంకేతిక విధానాలను అందిపుచ్చుకొని మెరుగైన సేవలందించాలని సూచించారు. హెచ్ఆర్డీ రూపొందించిన ఫౌండేషన్ కోర్సు పాలనాతీరు మెరుగు పరుచుకోవడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. డాక్టర్ మాధవి రావులపాటి కోర్సులోని అంశాలను వివరించారు. ఐఆర్ఎస్ అధికారి, ఎల్బీఎన్ఎన్ఏఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆకాంక్ష కులశ్రేష్ఠ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఐజీ శంకర్రావు మృతి
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): విశ్రాంత ఐపీఎస్ అధికారి బొమ్మకంటి శంకర్రావు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐజీ స్థాయిలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. 80 ఏండ్లపాటు తన జీవితాన్ని ఉత్సాహంగా గడిపిన ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడువడంతో పలువురు ప్రముఖులు, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.